నేటి నుంచి శాతవాహన పరిధిలో డిగ్రీ కళాశాలల తనిఖీలు
ప్రతీ కాలేజీకి రూ.30వేల వరకు టార్గెట్
ప్రైవేటు కాలేజీలతో ముందే కుదిరిన బేరం?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యో గి చేసిన కొన్ని ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి నేటి నుంచి యూనిర్సిటీ పరిధిలోని ప్రై వేటు డిగ్రీ కళాశాలల తనిఖీ ఉంది. తనిఖీ బృందాలు కాలేజీల్లో వసతులు, ల్యాబులు, మైదానం, మరుగుదొడ్లు, అకడమిక్స్ తదితర సదుపాయాలు ఉన్నాయా? లేవా అని స్వయంగా తనిఖీ చేస్తాయి. ఇదే అదనుగా ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పెద్దసార్లు తనిఖీకి వస్తున్నారని, మీ కాలేజీ పరిస్థితి తెలిసిందేగా.. అందుకే, కవర్లు సిద్ధం చేసి ఉంచాలని, ప్రతీ కవర్లో రూ.30వేలకు తగ్గకుండా నగదు ఉంచాలని ఫోన్లు చేసినట్లు సమాచారం.
కనీస వసతులు కరువు
ఏటా యూనివర్సిటీ నుంచి వచ్చే కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ (సీడీసీ) బృందాలు కాలేజీని తనిఖీ చేసి యూనివర్సిటీ అప్లియేషన్‌ను రెన్యూవల్ చేయాల్సి ఉంది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడుస్తోన్న పలు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కనీస వసతులు లేవు. ఈ విషయం వర్సిటీలో పెద్ద సారు వద్ద పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి తెలుసు. వర్సిటీ పరిధిలో 70 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 25 ప్రైవేట్ పీజీ కాలేజీలు, 24 ప్రైవేట్ బీఈడీ కాలేజీలు, 7 ఎంబీఏ, ఒక ఎంసీఏ కాలేజీ, రెండు ప్రైవేట్ లా కాలేజీలు ఉండగా.. వీటిలో సదుపాయాలు సరిగా లేని కాలేజీకి సదరు ఉద్యో గి కాల్ చేసినట్లు సమాచారం. కనీసం రూ.30వేల నగదుతో కూడిన కవర్లు సిద్ధం చేయాలని పెద్దసార్లకు ‘సిరి’కాంతులు కనిపిస్తేనే కాలేజీలు నడుస్తాయని, లేకపోతే ఇబ్బందులేని సదరు ఉద్యోగి స్ప ష్టంచేసినట్లు తెలిసింది. ఇటీవల వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చిన వ్యక్తి కూడా ఇదే తరహాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కావడం విశేషం.


