సిరిసిల్లటౌన్: వందలాది కోట్లతో లాభాల్లో నడుస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)ను రాజకీయ కుట్రతోనే ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విమర్శించారు. సిరిసిల్లలోని తన ఆఫీస్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఎలాంటి సమాచారం, నోటీసుల్లేకుండానే ఏప్రిల్ 1న ఎన్పీడీసీఎల్ నుంచి అధికార యంత్రాంగం విజిలెన్స్, స్థానిక పోలీసు బలగాలతో వచ్చి సంస్థను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. సంస్థలో 3.51 లక్షల విద్యుత్ కనెక్షన్లు, 3.10 లక్షల వినియోగదారులతో రూ.787 కోట్లకు పైగా లాభంతో నడుస్తుందన్నారు. కొందరి స్వార్థ రాజకీయ లబ్ధి కోసం గతంలోనూ సంస్థను విలీనం చేశారని ఆ సమయంలో సీఎంగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి లాభాల్లో నడుస్తున్న సంస్థను విలీనం చేయడం ఏంటని ఒప్పుకోలేదని గుర్తు చేశారు. దేశంలో 56 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి అవినీతికి పాల్పడిన పార్టీ ఇప్పుడు తమ పాలకవర్గం అవినీతికి పాల్పడించదని నిందలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007–10 వరకు అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో జీవో 51 ప్రకారం విచారణ చేపట్టగా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతర కాలంలో కృష్ణయ్య కమిషన్ సైతం నిబంధనలు అతిక్రమణ జరుగలేదని రిపోర్టు ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పుకోసం వేచి ఉన్నామని, సంస్థను కాపాడుకోవడానికి ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైతున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై న పాలకవర్గంపై కోపం ఉంటే సెస్‌ను యథాతథంగా కొనసాగిస్తే తాము రాజీనామాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.500కోట్లకు పైగా బకాయిలను సకాలంలో చెల్లించకుంటే సంస్థ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తూ సెస్‌ను విలీనం చేస్తున్నారన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులు విలీనం చేసుకుని సంస్థకు సంబంధించిన రూ.400 కోట్ల ఆస్తులనే వినియోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొందరు స్వార్థానికి సహకార సంస్థను ప్రైవేటు పరం చేయకుండా స్వయం ప్రతిపత్తితో సేవలను యథావిధిగా కొనసాగించేలా చర్యలను ఇప్పటికై నా తీసుకోవాలని కోరారు. సెస్ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి మాధవి, దార్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అవినీతిని బహిర్గతం చేయాలి
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు


