అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమావేశంలో నందెల్లి మహిపాల్‌ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమావేశంలో నందెల్లి మహిపాల్‌

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహించిన అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, జిల్లా ఒలింపిక్‌, అథ్లెటిక్‌ సంఘం అద్యక్షుడు నందెల్లి మహిపాల్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగాలాండ్‌ గవర్నర్‌ నందకిషోర్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి నిప్పయు రియో, ఉప ముఖ్యమంత్రి పాటిల్‌, సౌత్‌ ఏషియన్‌ అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు లలిత్‌ కె.భాను పాల్గొనగా తెలంగాణ నుంచి ప్రతినిధిగా మహిపాల్‌ హాజరయ్యారు. మహిపాల్‌ వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి దేశంలో అథ్లెటిక్స్‌ క్రీడల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలికితీసి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓసీపీ–3లో తప్పిన పెను ప్రమాదం

గోదావరిఖని: సింగరేణి రామగుండం డివిజన్‌–2 పరిధిలోని ఓసీపీ–3లో పెద్దప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఓసీపీ–3 కృషిభవన్‌ సమీపంలోని బేస్‌వర్క్‌షాప్‌ వద్ద నిలిపిఉన్న బొలేరోను గమనించకుండా ఆపరేటర్‌ డంపర్‌తో ఢీకొట్టాడు. అక్కడున్నవారు అరవడంతో డంపర్‌ నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే బొలెరోపై డంపర్‌ ఎక్కి ఉంటే అందులో ఉన్న నలుగురు చనిపోయేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన ఘటనపై ఆరా తీశారు.

ఆరబోసిన ధాన్యం చోరీ

పెద్దపల్లిరూరల్‌: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు.. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబోస్తే దొంగలు ఐదారు బస్తాల వరకు అపహరించుకుపోయారని పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన కౌలు రైతు మాటూరి రమేశ్‌ వాపోయాడు. తేమశాతం తగ్గితే కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ప్రధాన రోడ్డుకు సమీపంలో ఆరబోయగా.. దొంగలు ధాన్యం ఎత్తుకు పోయారని పేర్కొన్నాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని రూరల్‌ ఎస్సై మల్లేశ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement