కో ఆప్షన్‌పై కన్ను | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌పై కన్ను

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

● రూ.1.40 కోట్లు కాజేసిన ఉద్యోగి ● కేసు నమోదు.. లోతుగా దర్యాప్తు విద్యారంగంలో ప్రథమం పోలీసుశాఖలో జీతాల దొంగ!

న్యూస్‌రీల్‌

వ్యాపారుల అక్రమం.. వినియోగదారులకు శాపం

అటకెక్కిన పర్యవేక్షణ.. అంతే లేని అక్రమాలు

ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌: 1800114000, 1915

కరీంనగర్‌ కార్పొరేషన్‌: విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలవబోతుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలో వేడుకలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ జెండా ఎగురవేసి, కేక్‌ కట్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ.ఇమ్రాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఎన్‌ఎస్‌యూఐ తొలి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను సన్మానించారు. కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, వుట్కూరి నరేందర్‌రెడ్డి, ఎండీ.తాజ్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు

కరీంనగర్‌టౌన్‌: అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు అందజేసి పారదర్శకమైన సేవలకు నాంది పలికిందని, లబ్ధిదారులు అంగన్‌వాడీసేవలను సద్వినియోగం చేసుకోవాల ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సూ చించారు. గురువారం టీఎన్జీవో భవన్‌లో కరీంనగర్‌ అర్బన్‌ ప్రాజెక్ట్‌ అంగన్‌వాడీ టీచర్లకు మే యర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డితో కలిసి కొత్త ఫోన్లు, 17 మంది దివ్యాంగులకు మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేశారు. డీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ పాల్గొన్నారు.

జాబ్‌మేళాకు స్పందన

కరీంనగర్‌ సిటీ: విద్యార్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించాలని ఎస్సారార్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌ తెలిపారు. కళాశాలలో టీఎస్‌కేసీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా నిర్వహించారు. సుమారు 460 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 40 మంది ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌, అకడమిక్‌ కో– ఆర్డినేటర్‌ తాళ్లపల్లి రాజయ్య, ఐక్యూఏసీ కో– ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరిజోత్‌ కౌర్‌, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.సతీశ్‌ కుమార్‌, కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సెల్‌ కో– ఆర్డినేటర్‌ కె.సుధాకర్‌ పాల్గొన్నారు.

జైలులో వైద్య శిబిరం

కరీంనగర్‌క్రైం: జిల్లా జైలులో డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. ఖైదీలకు కంటి, దంత, అర్థోపెడిక్‌, చర్మ, ఈఎన్‌టీతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. వెద్యశాఖ అధికారులు సుధా రాజేంద్ర, నవీన, జైలు అధికారులు విజయదేని, జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌అర్బన్‌: మోసం.. బహిరంగ మార్కెట్‌లో స్వైరవిహారం చేస్తోంది. తూకంలో మోసం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా తనిఖీలు చేసి స్టాంపింగ్‌ వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు కిలోకు 15 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు దండుకుంటున్నారు. గ్యాస్‌, కూరగాయల నుంచి కార్పొరేట్‌ మార్కెట్ల వరకు తూకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో తూకంలో డొల్లతనం బయటపడగా ఉన్నతాధికారుల పర్యవేక్షణను ప్రశ్నిస్తోంది. నగరంలోని ప్రకాశం గంజ్‌, పండ్ల మార్కెట్‌, శనివారం అంగడి, కశ్మీర్‌గడ్డలో గల రైతుబజార్‌, చేపల మార్కెట్‌, ప్రముఖ సూపర్‌ మార్కెట్లలో పలు వస్తువులను కొనుగోలు చేసి తూకం వేయగా వ్యత్యాసమేర్పడటం విమర్శలకు తావిస్తోంది. బహిరంగ మార్కె ట్లో, రేషన్‌ దుకాణాల్లో వినియోగదారులు మోసపోయిన సందర్భాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా యి. ఎరువులు, రైసు మిల్లులు, పెట్రోలు బంకులు, ఇతర ఉత్పత్తి కేంద్రాలు తూనికలు, కొలతలకు ఆస్కారమున్న ప్రతిచోట వినియోగదారులను ఏదో ఒక రకంగా మోసగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

తనిఖీల్లేవు.. స్టాంపింగ్‌ లేదు

తూనికలు కొలతలశాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండగా ఉన్న అధికారులైనా విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నారా.. అంటే అదీ లేదు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం తప్ప కేసుల ప్రగతి అంతంతే. రాజకీయ ఒత్తిడులు ఉన్నాయంటూ వ్యాపారులతో ఉన్న అనుబంధంతో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయిస్తూనే తూకంలోనూ దోచుకుంటున్నారు.

మేళాలతోనే ఫలితం

తూకానికి వినియోగించే సామగ్రికి అర్ధ సంవత్సరం, సంవత్సరానికి సంబంధిత శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి. కాగా, క్షేత్రస్థాయిలో అలాంటివేమీ కనిపించడం లేదు. కాలంచెల్లిన తూకం సామగ్రిని వాడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. ముద్రల ద్వారా జిల్లాలో రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరే వీలుంది. ఇక లీటర్ల కొద్ది విక్రయించే వాటిలోనూ మోసాలే. ప్యాకెట్లలో ద్రవ పదార్థ రూపంలో మార్కెట్లో లభించేవన్నీ దాదాపు అక్రమ విక్రయాలే. ప్రభుత్వ గుర్తింపు పొందినవి కొన్నే ఉంటాయి. తూకం సామగ్రికి ముద్రలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మేళాలు నిర్వహిస్తే ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. తద్వారా సర్కారుకు ఆదాయంతో పాటు వినియోగదారులకు తూకంలో మోసపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

వినియోగదారులకు సూచనలు

● వినియోగదారులు కళ్లారా చూసిన మోసాలను సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా తదుపరి చర్యలకు ఆస్కారముంటుంది.

● కొనుగోలు చేసిన కేంద్రంలో తూకం, కొలతల ను గమనించాలి. తేడాలుంటే ప్రశ్నించాలి. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు పొందడం ఉత్తమం.

● తూనికలు, కొలతల శాఖ నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచాలి.

● ఎలక్ట్రానిక్‌ తూకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్‌ బంకుల్లో కొలతలను సరిచూశాకే వాహనంలో ఇంధనం పోయించుకోవాలి.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఐదు పదవులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ప్రక్రి య కొనసాగుతుంది. కో ఆప్షన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికార బీజేపీకి పూర్తిస్థాయిలో బలం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన మాజీలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

16వ తేదీ వరకు దరఖాస్తులు

కో ఆప్షన్‌ ఎన్నికలకు శుక్రవారం నుంచి నగరపాలకసంస్థ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. 16వ తేదీ తరువాత రెండు,మూడు రోజుల్లో నగరపాలకసంస్థ సర్వసభ్య ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నా రు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పాలనలో ప్రత్యేక పరిజ్ఞానం

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ఐదు స్థానాలకు గాను రెండు మైనార్టీలకు అందులో ఒకటి మహిళకు కేటా యించారు. ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు మైనార్టీ కేటగిరీలోకి వస్తారు. మిగతా ముగ్గురిలో ఒకరు మహిళ ఉండాలి. పోటీచేసే అభ్యర్థులు విధి గా నగరపాలకసంస్థ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న రెవెన్యూ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సంబంధించి మాజీ సర్పంచ్‌, మాజీ వార్డు సభ్యులు కో ఆప్షన్‌ పదవులకు పోటీపడేందుకు అర్హులు. వీరంతా కూడా మొత్తంగా ఐదు సంవత్సరాల పదవీ కాలం చేసి ఉండాలి. వీరితో పాటు మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా మూడు సంవత్సరాల సర్వీసు చేసిన అనుభవం ఉన్న వాళ్లు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ పోస్టు హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందిన అధికారులు అర్హులు.

పోటీకి మాజీలు సై

ఐదు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఆ శావహుల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ కార్పొరేటర్లు పలువురు కో ఆప్షన్‌పై కన్నేశారు. నగరపాలకసంస్థలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, కో ఆప్షన్‌ గెలవడానికి 34 మంది అవసరం. ఈ లెక్కన నగరపాలకసంస్థలో అధికార బీజేపీకే ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను గెలుచుకోగా, మేయర్‌ఎన్నిక సందర్భంగా ముగ్గురు స్వతంత్రులు బీజేపీలో చేరారు. ఆ తరువాత మరో స్వతంత్ర కార్పొరేటర్‌ చేరడంతో బీజేపీ బలం 34కు చేరుకొంది. దీనితో ఐదు కో ఆప్షన్‌ పదవులను గెలుచుకోవడం బీజేపీకి సులువుగానే ఉంది. అయినప్పటికి, బీజేపీయేతర కార్పొరేటర్లు 32 మంది ఉండడం, క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలతో ఇతర పార్టీల నుంచి కూడా పోటీపడేందుకు మాజీలు సిద్ధమవుతున్నారు. పార్టీల బలాబలాలు, కార్పొరేటర్లలో తమకున్న అనుకూలత, ఆర్థిక వ్యవహారాల లెక్కలతో తలమునకలవుతున్నారు.

కరీంనగర్‌క్రైం: ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల జీతాలకు రక్షణ లేకుండా పోయింది. సొంతశాఖలోని తోటి సిబ్బంది జీతాలు కాజేసిన ఘటన కలకలం రేపింది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన భారీ కుంభకోణం కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బట్టబయలైంది. సుమారు రూ.1,40,18,308 వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్‌ఫోర్స్‌ విచారణలో తేలింది. గతంలో పే సెక్షన్‌లో పనిచేసిన ఓ పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్‌ నంబర్లను అనుసంధానం చేశాడు. తద్వారా 2022 నుంచి 2026 వరకు సదరు ఉద్యోగుల జీతాలు అక్రమంగా పొందినట్లు తెలిసింది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి? ఏఏ స్థాయివారు భాగస్వాములై ఉన్నారు? ఉన్నతాధికారులకు సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

నగరంలోని మంకమ్మతోటలో గల సూపర్‌మార్కెట్‌లో కిలో శనగపప్పు కొనుగోలు చేయగా మళ్లీ తూకం వేస్తే 985 గ్రాములు వచ్చింది. 15 గ్రాములు తక్కువ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement