ఎండ.. అప్రమత్తతే అండ | - | Sakshi
Sakshi News home page

ఎండ.. అప్రమత్తతే అండ

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

వడదెబ్బ లక్షణాలు ఇవే.. మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దు నీరు తాగాలి.. తాజా ఆహారం తీసుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అందుబాటులో మందులు, వైద్యులు

గ్లోబల్‌ వార్మింగ్‌తోనే..

రోజురోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతలు వేసవి వ్యాధులతో జాగ్రత్తలు అవసరం అన్ని పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్‌ గర్భిణులు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అవగాహనతో వడదెబ్బకు దూరం ‘సాక్షి’తో డీఎంహెచ్‌వో వెంకటరమణ

కరీంనగర్‌: ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ప్రతా పం చూపుతున్నాడు. గతేడాది కన్నా ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్‌ వరకు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరగనుంది. మే తొలివారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ తొలివారం నుంచే దడదడలాడిస్తున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు.

వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడం, చెమటపట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్‌ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడారిపోవడం వంటివి కనిపిస్తాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్నప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపి మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్‌ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఎండ ఎక్కువగా ఉండే ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు, తెల్లని దుస్తులు ధరించాలి. ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వాడితే మంచిది. ఎండలో తిరిగితే వృద్ధులు, చిన్నారులు, మహిళలు, గర్భిణులు, రోగులు, శ్రమజీవులు, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది.

ఎండాకాలంలో నీటిలోపంతో డీహైడ్రేషన్‌ అవుతుంది. దీంతో శరీరంలో శక్తి తగ్గి అలసట ఏర్పడుతుంది. ప్రతి గంటలకు ఒక గ్లాసు నీటి చొప్పున రోజు 10– 12 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా, ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. వేసవిలో ప్రతి రోజు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్‌ ఫుడ్స్‌, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.

శరీరంలో టెంపరేచర్‌ పెరగకూడదంటే కూలీలు వారు చేసే పనుల షిఫ్టులను మార్చుకోవాలి. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనులు చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం నీడపట్టున ఉండాలి. గర్భిణీ సీ్త్రలు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు హైరిస్క్‌ గ్రూపులో ఉంటారు. ఇలాంటి వారు ఎండలో ఎక్కువ సమయం ఉండకూడదు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ జరగకుండా ఉండేందుకు అన్ని పీహెచ్‌సీలలో ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా పీహెచ్‌సీకి వెళ్లి తీసుకొని వాడుకోవచ్చు.

గ్లోబల్‌ వార్మింగ్‌తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వాడకం పెరిగి ప్రకృతి దెబ్బతినడంతో ఓజోన్‌ పొర తగ్గి ఎండల తీవ్రత పెరుగుతోంది. చెట్లను పెంచడం, నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement