చీకటి నుంచి వెలుగులోకి..
అంధుల భవిష్యత్తుకు దిక్సూచి
● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి
● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం
● నేడు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం
కరీంనగర్: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసన ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా.. తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ విద్యలో ప్రతిభ కనబరుస్తున్నారు. చీకట్లో అక్షరాల విత్తనాలను అందిపుచ్చుకునే సమర్థత సాధిస్తున్నారు. నైరాశ్యపు మేఘాలను చీల్చుకొని హృదయాల్లో ఆత్మవిశ్వాసం నింపుకొని అక్షరాలను నేర్చుకుంటూ చీకటి ప్రపంచపు వెలుగు రేఖలుగా నిలుస్తున్నారు. బ్రెయిలీ లిపి అనే మనోనేత్రం ద్వారా ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. బ్రెయిలీ లిపి అంధుల పాలిట ఆశాకిరణంగా మారింది. లూయిస్ బ్రెయిలీ జయంతి పురస్కరించుకొని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం జరుపుకుంటున్నారు.
అంచెలంచెలుగా..
సాధారణంగా చదువుకోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేరు కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీనికోసం స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపర్ మీద ఎత్తుగా ప్రింట్ చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత మాత్రం బ్రెయిలీకి దక్కింది.
ఆరు చుక్కలతో లిపి
పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. బ్రెయిలీ చిన్న వయసులోనే చూపు కోల్పోయాడు. అక్షరం, సంఖ్య సూచించడానికి ఆరు చుక్కలను ఉపయోగించి స్పర్శ ద్వారా గుర్తించేలా కోడ్ కనుగొన్నారు. ప్రస్తుతం బ్రెయిలీ కోడ్ ద్వారా గణితం, సంగీతం, కంప్యూటర్ ప్రోగ్రాం చదవడం, రాయడం చేయొచ్చు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలుంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కో అక్షరానికి ఒక్కో నంబర్ ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తుపెట్టుకొని మనో నేత్రంతో చదువుతూ విద్యనభ్యసిస్తున్నారు.
తెలంగాణలో 2 పాఠశాలలు
కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో వికలాంగుల శాఖ ద్వారా ప్రభుత్వం అంధుల పాఠశాలలను నెలకొల్పింది. కరీంనగర్ అంధుల పాఠశాలలో వివిధ జిల్లాలకు చెందిన 80 మంది విద్యార్థులుండగా.. ఇందులో 48 మంది బాలురు, 32 మంది బాలికలున్నారు. వీరంతా 1 నుంచి 10వతరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యనందించేందుకు 25 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు.
నాకు పుట్టుకతోనే అంధత్వం. మాది మహబూబ్‌నగర్. అక్కడే అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ అనంతరం టీచర్ శిక్షణ పొంది కరీంనగర్‌లో ఉపాధ్యాయుడిగా 3 నెలల క్రితం జాయిన్ అయ్యాను. ఇదంతా బ్రెయిలీ లిపి చలవే. బ్రెయిలీ లిపి లేకపోతే అంధులకు భవిష్యత్తు లేదు.
– డి.భాస్కర్, ఉపాధ్యాయుడు
చీకటి నుంచి వెలుగులోకి..
చీకటి నుంచి వెలుగులోకి..


