స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలరాజ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. బాలరాజ్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరారు. కేటీఆర్ స్పందించి మృతదేహం సగ్రామానికి రావడానికి కృషి చేశారు. బాలరాజ్ మృతదేహం శనివారం ఇంటికి చేరగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సర్పంచ్ ఎలగందుల నర్సింహులు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పందిళ్ల నాగరాణి పరామర్శించారు.
జూలపల్లి: కుమ్మరికుంటలో శనివారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దొడ్ల స్వామి(53) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సనత్‌కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంట గ్రామానికి చెందిన దొడ్ల స్వామి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నా నయం కాక మానసికంగా బాధతుండేవాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వచ్చి ఇంట్లోనే ఉండగా.. భార్య భాగ్య వ్యవసాయ పనులకు వెళ్లింది. కుమార్తె మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోగా.. ఇంటి ముందున్న రేకుల షెడ్డులో స్వామి పైపునకు చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి కుమార్తె చుట్టుపక్కల వారిని పిలిచింది. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ధర్మారం: కొత్తూరు పరిధిలో 4 కరెంట్ మోటార్ల కాపర్ వైరుతోపాటు మోటార్ బాడీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన తాళ్ల రాజేశంగౌడ్, పెనుగొండ అంజయ్య, కొమ్మ బాలయ్య, రేషవేని స్వామికి సంబంధించిన వరి పొలాలు గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్నాయి. ఈ రైతుల పొలాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ పొలాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండడంతో.. రాత్రివేళ దొంగలు మోటార్ సైకిళ్లపై వచ్చి కరెంట్ మోటార్‌లో ఉన్న కాపర్ వైరుతోపాటు బాడీలను ఎత్తుకుపోయారని భావిస్తున్నారు. శనివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన వారికి మోటార్ కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు.
● రూ.20వేల చొప్పున వసూలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చేతబడి చేశారని, నయం చేస్తానని ఓ వ్యక్తిటోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంసానిపల్లె, చుట్టుపక్కల గ్రామాల్లో అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తి బిక్షాటన చేస్తూ ఇళ్లలోకి వెళ్లి ‘అమ్మా మీ ఇంటికి అరిష్టం తలిగిందని, చేతబడి చేశారని, తొలగించాలి’ అని మాయమాటలతో నమ్మిస్తూ రూ. 10వేల చొప్పున వసూలు చేసుకున్నట్లు సమాచారం. తనది కాల్వశ్రీరాంపూర్ అని తన ఫోన్ నంబర్‌కు ఫోన్ పే చేయాలని సదరు వ్యక్తి పలువురికి నంబర్ ఇచ్చాడు. నాంసానిపల్లె గ్రా మానికి చెందిన రాజు అనే బాధితుడి నుంచి నగదు రూ.10వేలు, పోన్ పే ద్వారా రూ.10వేలు తీసుకోగా, శనివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసం చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేశ్ తెలిపారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన తమ్మనవేని సౌజన్య అనే బాలింత శనివారం మృతిచెందింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సౌజన్యను అనారోగ్య సమస్యలతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.


