చిన్నారికి ‘ఊపిరి’పోయండి
ముస్తాబాద్(సిరిసిల్ల): కూతురు పుట్టడంతో మహాలక్ష్మీ వచ్చిందని వారు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం చిన్నారి అనారోగ్య సమస్యతో ఆవిరైంది. ఐదేళ్ల చిన్నారి అంతుచిక్కని ఊపిరితిత్తుల వ్యాధికి గురై ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉంది. ఆర్థికంగా అంతంతే ఉన్న ఆ కుటుంబ ఆర్థిక సాయం చేయాలని దాతలను వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సూర రాజశేఖర్, రమ్య దంపతుల కూతురు వైష్ణిక(5) ఊపిరితిత్తుల వ్యాధికి గురైంది. కూలీ పనులు చేసుకునే వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వైష్ణికను రెండు నెలల క్రితం బడిలో చేర్పించారు. ఆడుతూ పాడుతూ ఉన్న వైష్ణిక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊపిరి ఆడడం లేదంటూ పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకిందని, కుడివైపు ఊపిరితిత్తులకు బ్రోంకోగ్రామ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతా పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. మానవతావాదులు, ప్రభుత్వమే తమ చిన్నారిని కాపాడాలని వేడుకుంటున్నారు. చిన్నారి బాలికకు అండగా నిలిచేదాతలు 95153 67957లో సంప్రదించాలని కోరుతున్నారు.
అంతుచిక్కని వ్యాధితో అచేతనస్థితి
ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు


