
వాయినాల బతుకమ్మ
సిరిసిల్లటౌన్: తెలంగాణ ప్రజల సంస్కృతి బతుకమ్మ. పూలపండుగ అంటేనే ఆడపడుచుల
ఇష్టమైన పండుగ. ఏటా గడ్డిపూలను గౌరమ్మగా పేర్చి ఆడపడుచులుగా కొలుస్తుంటారు. పృకృతి సహకరించిన కాలంలో పూలు విరివిగా పూస్తాయి. లేకుంటే అడవిలో దొరికే బతుకమ్మ పూలకు సైతం కరువు ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో సిరిసిల్లలో తయారయ్యే కాగితపు రంగు పూల ‘సిద్దుల బతుకమ్మలను’ పూజించడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏళ్లుగా వస్తోంది. వాయినాల బతుకమ్మలుగా పిలుచుకునే కాగితపు రంగుల బతుకమ్మలను సిరిసిల్లకు చెందిన సిద్ధుల కులస్తులు తయారీ చేసి విక్రయిస్తుంటారు.
వాయినాల బతుకమ్మలపై ప్రత్యేక కథనం.
● సిరిసిల్లకు ప్రత్యేకం సిద్ధుల బతుకమ్మ
● కాగితపు బతుకమ్మల తయారీతో ఉపాధి
● పేదలకు అందుబాటులో ధరలు
బతుకమ్మలు పేర్చడానికి కావాల్సిన ఎంగిలిపూలు కరువు ఏర్పడినప్పుడు సిద్ధుల బతుకమ్మలకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మలకు కావాల్సిన గునుగు, తంగేడుపూలు కొరత ఎక్కువైంది. దీంతో సిద్దుల బతుకమ్మలకు ఆర్డర్లు రావడంతో కొద్ది రోజుల నుంచి బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో సిద్దుల బతుకమ్మలకు డిమాండ్ రావడంతో తయారీని పెంచారు. గునుగు, తంగేడు వంటి బతుకమ్మపూలు కొరతతో ఈఏడు కాగితపు బతుకమ్మలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. వెదురు పుల్లలను బతుకమ్మ ఆకారంలో పేర్చి వాటిపై కాగితపు పూలను అతికిస్తూ.. నెల రోజులుగా ఇంటిల్లి పాది బతుకమ్మలను తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు.
● స్పెషల్‌గా సిద్దుల బతుకమ్మలు
కాగితపు పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేయడంలో సిద్దుల కులస్తులది అందవేసిన చేయి. తరతరాలుగా వీరు కులవృత్తిగా బతుకమ్మలను తయారు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో సిద్దుల కులస్తులకు ప్రత్యేకంగా కాలనీ ఉంది. పండుగలకు పూజ సామాగ్రి, కుంకుమ, గవ్వలు, అలంకార సామగ్రి విక్రయించడం వీరి ప్రధాన జీవనోపాధి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు సుమారు ముప్పై కుటుంబాలు కాగితపు పూలతో బతుకమ్మలు తయారు చేస్తారు. ఒక్క అడుగు నుంచి పది అడుగుల పొడవు వరకు కాగితపు బతుకమ్మలను తయారుచేస్తారు. ఒక్కో బతుకమ్మ రూ.50 మొదలుకొని రూ.1200 విక్రయిస్తారు.
● వాయినాల బతుకమ్మలుగా...
కొత్త కోడలుకు అత్తారింటి నుంచి మొదటి బతుకమ్మ పండుగకు కాగితపు పూల బతుకమ్మలను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో బతుకమ్మ పూలు దొరకడం కష్టంగా ఉంది. దొరికిన కొద్దిపాటి పూలను రైతులు, గిరిజనులు అమ్ముకొంటూ... తక్కువ రేటుకు దొరికే కాగితపు పూల బతుకమ్మలను కొనుక్కొని వెళ్తున్నారు.

వాయినాల బతుకమ్మ