
విశ్వవిపణిలోకి సింగరేణి
ఫ్యూచర్‌సిటీలో సంస్థకు ప్రత్యేకస్థానం ప్రత్యేక కట్టడాల కోసం పదెకరాలు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిలోగా నిర్మాణాలు బొగ్గు గనుల సంస్థకు ఆదేశం యుద్ధప్రాతిపదికన ముందుకు వెళ్తాం సింగరేని సీఎండీ బలరాం
గోదావరిఖని: దసరా పండగకు ముందే ప్రభుత్వం సింగరేణికి శుభవార్త చెప్పింది. ఫ్యూచర్ సిటీలో పదెకరాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రకటించడంతో ప్రపంచస్థాయి వ్యాపార విస్తరణకు మార్గం సుగమమైనట్లయ్యింది. అయితే, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేస్తేనే స్థలం అప్పగిస్తామని సీఎం కండిషన్ పెట్టారు. ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడే అవకాశం సింగరేణికి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మహారత్న కంపెనీలకు దీటుగా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సింగరే ణి వరుస లాభాలతో మహారత్న కంపెనీలకు ధీటు గా ముందుకు సాగుతోంది. సుమారు 41వేల మంది పర్మినెంట్, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులతో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో వ్యాపారాలను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇప్పటికే గోల్డ్, మెటల్ మైన్స్ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిఉంది. క్లిటికల్ మినరల్ పరిశోధనలోనూ ముందుకెళ్తోంది. రామ గుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓసీపీలో హైడ్రోపవర్ ఉత్పత్తికి కూడా ప్రయోగ్మాకంగా సిద్ధమైంది.
ఇతర రాష్ట్రాలకూ విస్తరణ..
సింగరేణి తెలంగాణతోపాటు పలురాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తోంది. గోల్డ్, కాపర్ అన్వేషణ కోసం కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గలో పరిశోధనకు లైసెన్స్ పొందింది. ఒడిశా నైనీబ్లాక్‌లో భారీ ప్రాజెక్టు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది.
పదెకరాల్లో కార్పొరేట్ కార్యాలయం..
సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా కార్యాలయాన్ని కూడా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ఆర్ కనెక్టివి కల్పించారు. నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ, వాణిజ్య, వసతి, పారిశ్రామిక, వినోదం ప్రాంతాలు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అందులో పదెకరాలు కేటాయించడం సింగరేణికి శుభసూచకమని నిపుణులు పేర్కొంటున్నారు.

విశ్వవిపణిలోకి సింగరేణి