
నాలుగు దశల్లో స్థానిక పోరు
తొలిరెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
మలిరెండు విడుతల్లో గ్రామపంచాయతీ ఎలక్షన్స్
తొలుత గ్రామపంచాయతీ, తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు
ఈనెల 9నుంచి నామినేషన్ల స్వీకరణ
33 రోజులపాటు ‘లోకల్’ ఎన్నికల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
జిల్లా స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. 33 రోజుల సుదీర్ఘ ప్రక్రియకు జిల్లాలోని 15 మండలాలు వేదికవనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి రెండుదశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తరువాత రెండు దశల్లో సర్పంచి, గ్రామ సభ్యులకు నిర్వహించనున్నారు. మొదటి విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి లోని (6మండలాలు) ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాల్లో, రెండో విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని (9 మండలాలు) చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి.
అక్టోబరు 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ..
సెప్టెంబరు 29న మొదలైన ఎన్నికల ప్రకియ అక్టోబరు 31 వరకు మొత్తం 33 రోజుల పాటు జరగ నుంది. ఫలితాలు వెలువడే 31వ తేదీ వరకు ఎన్నిక ల కోడ్ అమలులో ఉండనుంది. అక్టోబరు 9న తొలివిడత, అక్టోబరు 13న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా, అదే గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 21న తొలివిడత, అక్టోబరు 25న రెండో విడత ప్రారంభం కానుంది. ఇక ఫలితాల విషయానికి వస్తే.. తొలివిడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఫలితాలు నవంబరు 11న, రెండో విడత అక్టోబరు16న వెలువడనున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలలో నవంబరు 4న తొలి విడత ఫలితాలు, నవంబరు 8న రెండో విడత ఫలితాలు వెలువడనున్నాయి.