
మండలానికి ఒక ఆర్వో
సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు( సర్పంచ్, వార్డు సభ్యులు)ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రతీ మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్‌వోను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, దరావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, వాసాల రమేశ్, సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, సాతినేని శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి, కే.మణికంఠ రెడ్డి, సయ్యద్ బర్కత్ అలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.