
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
మల్యాల(చొప్పదండి): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బూస అంజయ్య(51) జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జూలై 6న అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. దుబాయ్‌లో ఉన్న మృతుడి కుమారుడు బూస హరీశ్ తన తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని ముత్యంపేట మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్‌రావు, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండ్లపల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాడు. వారు కంపెనీ యాజమాన్యంతో సంప్రదించి, మృతదేహాన్ని ఆదివారం దుబాయ్ నుంచి ముత్యంపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.