
ఆటల పల్లె.. పతకాల ముల్లె
● జాతీయస్థాయిలో రాణిస్తున్న ఆయా గ్రామాల యువకులు ● ఉద్యోగాల కోసం ఎదురుచూపులు
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి, అనుపురం గ్రామాలు క్రీడాకారులకు పెట్టింది పేరుగా నిలిచాయి. ఈ గ్రామాల నుంచి ఎందరో క్రీడాకారులు గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఎలాంటి శిక్షణ లేకున్నా పాఠశాల స్థాయి నుండే క్రీడల్లో పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కొంత మంది యువకులు క్రీడలపై ఆసక్తితో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని గ్రామీణ క్రీడలకు ఊపిరి పోస్తున్నారు. కబడ్డీ పోటీలంటేనే సదరు గ్రామాల యువకులు పాల్గొంటారని పేరుంది. కాగా, నూకలమర్రి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ పేరుతో క్రీడాకారులు యూత్‌గా ఏర్పడి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
ఉద్యోగాల కోసం నిరీక్షణ
కబడ్డీ క్రీడపై ఎంతో ఆసక్తి ఉన్న యువకులు క్రీడల కోటాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా, చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయస్సు దాటిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా ఉండిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, కుల వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పంచాయతీలో కప్‌లు
మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల నుంచి కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులు వారికి వచ్చిన కప్‌లను ఆయా గ్రామపంచాయతీల్లో భద్రంగా ఉంచుతారు. కాగా, కప్‌లను చూసి సంతోష పడడం తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆయా గ్రామాల క్రీడాకారులు నిరాశలో ఉన్నారు.
పదుల సంఖ్యలో క్రీడాకారులు
జిల్లాలోనే నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అనుపురం క్రీడా గ్రామాలుగా పేరుపొందాయి. ఈ గ్రామాల నుంచి 30 ఏళ్లుగా ఎందరో క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ప్రతీ గ్రామం నుంచి పదుల సంఖ్యలో కబడ్డీ క్రీడాకారులు ఉన్నారు. ప్రస్తుతం ఒకరిద్దరికి తప్ప మిగతా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు.