దళారీ బెడద లేదిక! | - | Sakshi
Sakshi News home page

దళారీ బెడద లేదిక!

Aug 4 2025 3:51 AM | Updated on Aug 4 2025 3:51 AM

దళారీ బెడద లేదిక!

దళారీ బెడద లేదిక!

విత్తనోత్పత్తిలో నూతన ప్రక్రియకు శ్రీకారం

మంత్రి ఆదేశాలు అమలైతే అన్నదాతకు మేలు

కరీంనగర్‌ అర్బన్‌: విత్తనోత్పత్తిలో దళారీ బెడద లేకుండా నేరుగా కంపెనీలే రైతులతో సంబంధాలు పెట్టుకోవాలన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటన అన్నదాతల్లో ఆనందం నింపుతోంది. సదరు ఆదేశాలు అమలైతే రైతులకు గిట్టుబాటు ధర రానుండగా, కంపెనీలకు మేలు చేకూరనుంది. ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం సాగుతుండగా విత్తనాలకు డిమాండ్‌ లేదంటూ రైతులను మోసగిస్తున్న ఘటనలు అనేకం.

ఆర్గనైజర్లతోనే రైతులకు నష్టం

విత్తనోత్పత్తిలో దక్షిణ ఆమెరికా తరువాత తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమన్నది శాస్త్రవేత్తల మాట. అందులో ఉత్తర తెలంగాణ మరింత అనువైనదని గుర్తించారు. ప్రధానంగా పంట కోత సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ చీడపీడల బెడద, గాలిలో తక్కువ తేమశాతం, నేలల్లో పొటాష్‌ పోషక సమతౌల్యం, సాగునీటి లభ్యత ఉండటం వంటి అంశాలు విత్తనోత్పత్తికి ఉపయోగకరంగా ఉండటంతో కంపెనీలు కరీంనగర్‌పై కన్నేశాయి. ఆర్గనైజర్ల ద్వారా జిల్లాలో రైతుల శ్రమతో ఆటలాడుతున్నాయి. పలు రకాల విత్తనాలను సాగు చేయించి ముందొక మాట దిగుబడి తదుపరి మరో ధర చెల్లిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల డబ్బులు ఎగవేసిన సందర్భాలున్నాయి. విత్తనోత్పత్తి వ్యవస్థలో ఆర్థికంగా బాగుపడిన రైతుల సంఖ్య పదిశాతం ఉంటే, మధ్యవర్తులుగా ఉండి రూ.కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య వందశాతం ఉంది. ప్రధాన ఆర్గనైజర్లు ఊరురా వందల సంఖ్యలో సబ్‌ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గనైజర్లతో రైతులకు నేరుగా ఒప్పందాలు లేవు. దస్త్రాల్లో రైతుల వివరాలు మాత్రమే నమోదు చేసుకుంటారు. రైతులకు ఇచ్చే ప్రతి రూపాయికి బాధ్యులుగా సబ్‌ ఆర్గనైజర్లు ఉంటున్నారు.

హైబ్రిడ్‌, సూటి రకాల్లో చేతివాటం

జిల్లాలో 65వరకు సూటి వరి విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జొన్న, సజ్జ సంస్థలు జిల్లాలో విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధన స్థానాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయశాఖ గ్రామీణ విత్తనోత్పత్తి కేంద్రం వంటి వాటి ద్వారా సూటి రకాల్లో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. సూటిరకాల్లో రైతులకు పెద్దగా మోసాలు జరగకపోయినా హైబ్రిడ్‌ విత్తనోత్పత్తిలోనే తీవ్రంగా మోసపోతున్న ఉదంతాలున్నాయి. ప్రధానంగా రైతులు అమాయకంగా సంస్థల సూచనలు పాటిస్తుండటం.. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో హైబ్రిడ్‌ విత్తన ఉత్పత్తిలో ప్రయివేటు సంస్థలదే పెత్తనంగా మారింది. గతంలో మెట్‌పల్లి, కోరుట్ల, మానకొండూరు, హుజూరాబాద్‌ ప్రాంతాల రైతులతో పలువురు ఏజెంట్లు పలు విత్తనాలు ఉత్పత్తి చేయించి పంట తీసుకెళ్లాక సంస్థలు రైతులు చెల్లింపులు చేయకుండా మోసగించాయి. దీంతో ప్రభుత్వమే రైతులకు రూ.10కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంతకుముందు జమ్మికుంట ప్రాంతంలో బీపీటీ సూటిరకానికి క్వింటాల్‌కు రూ.1800పైగా ధర చెల్లిస్తామని విత్తన కంపెనీ సంస్థలు పంట పండిన తరువాత రూ.200 తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement