
రసాభాసగా అర్బన్ బ్యాంకు సమావేశం
కరీంనగర్‌అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సమావేశం రసాభాసాగా సాగింది. కొంతకాలంగా అంతర్గతంగా ఉప్పు నిప్పులా ఉన్న వైరం ఆదివారం రెవెన్యూ గార్డెన్ వేదికగా బయటపడింది. గత పాలకవర్గం, ప్రస్తుత పాలకవర్గానికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇటీవల టీఎన్జీవో భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కోరం లేదని ఈ నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమావేశ ఆరంభంలో బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి హైకోర్టు తీర్పు ప్రతంటూ చూపిస్తూ వాటి సారాంశాన్ని వివరించారు. గత పాలకవర్గాల తీరు నిబంధనలకు విరుద్ధమని, కోరం లేకుండా ఎన్నో తప్పులు చేశారని ఆరోపించారు. దీంతో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారుల కనుసన్నలో సమావేశాలు జరిగాయని, కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెరవెనుక ఎవరున్నారో తెలుసని, ఎవరికీ భయపడేదిలేదన్నారు. దీనివెనుక రాజకీయ కోణం ఉందని, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో పోటీపడి గెలవాలని, తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
15మంది సభ్యుల శాశ్వత తొలగింపు
సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2007–17 వరకు ఉన్న పాలకవర్గ సభ్యులు కర్ర రాజశేఖర్, ఎండీ సమియుద్దీన్, ఇ.లక్ష్మణరాజు, వరాల జ్యోతి, దేశ వేదాద్రి, అనరాసు కుమార్, కె.రవి, సరిల్ల ప్రసాద్, వజీర్ అహ్మద్, తాటికొండ భాస్కర్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ, దునిగంటి సంపత్, తాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతిలను బ్యాంకు సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సభ ఆమోదం తెలుపగా చైర్మన్ విలాస్‌రెడ్డి ప్రకటించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో నునుగొండ శ్రీనివాస్, సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, రేగొండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, మంగి రవీందర్, నాగుల సతీశ్, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గత పాలకవర్గ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
అంతా చట్టప్రకారమే జరిగిందన్న మాజీ అధ్యక్షుడు