
పచ్చదనం పెంపే లక్ష్యం
● కసరత్తులో అటవీశాఖ ● జిల్లాలో అటవీ విస్తీర్ణం 0.02శాతమే
కరీంనగర్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల పెంపుదలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అడవులను రక్షించడంతో పాటు పచ్చదనంతో విస్తరించి ఉండే రెవెన్యూ, ప్రైవేట్ భూముల్లో అడవుల పెంపకానికి ప్రాధాన్యమిస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33శాతం అడువులుండాలనేది నిబంధన. కానీ జిల్లాలో అడవుల శాతం 0.02శాతమే.
పచ్చదనమే లక్ష్యం
అటవీ సంరక్షణకు సంబంధితశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అభివృద్ధి పనులు ఖర్చుల వివరాల నివేదిక తయారు చేశారు. ప్రధానంగా అటవీ భూముల స్థిరీకరణ, అటవీ ప్రాంత పునరుజ్జీవం, అటవీ జంతువుల సంరక్షణకు కావా ల్సిన నిధుల ప్రతిపాదనలను ఇప్పటికే అందజేశా రు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీల్లో 10వేలకు పైగా మొక్కలను పెంచుతుండగా పంచాయతీలకే బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్క డ మొక్కలు పెంచేలా కార్యచరణ చేస్తున్నారు.
జిల్లా అడవులు 0.30 శాతమే
రాష్ట్రంలోని మన జిల్లా అడవుల వాటా 0.30శాతమే. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రేంజ్‌లుండగా కరీంనగర్ అటవీ రేంజ్‌లో 101.75 హెక్టా ర్లు, హుజూరాబాద్ రేంజ్‌లో 692.5 హెక్టార్ల అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. హు జూరాబాద్ పరిధిలో సైదాపూర్ మండలం ఆకునూరులో మాత్రమే అడవి ఉండగా కరీంనగర్ పరిధిలో గంగాధర మండలం వెంకటాయపల్లి శివారులో అడవి ఉంది. పచ్చదనంతో కూడిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవో తెలుసుకునేందుకు ఇప్పటికే శాటిలైట్ ఆధారంగా క్షేత్రస్థాయిలోని వివరాల క్రోడీకరణ కోసం ఛాయచిత్రాలను సేకరించే ప్రక్రియను అటవీశాఖ ప్రారంభించింది. జిల్లాలవారీగా పచ్చదనం విస్తరించిన ప్రాంతాల్లో ప్రైవేట్ పరిధిలోనివా,? రెవెన్యూ పరిధిలోనివా.? నని ఆరా తీస్తోంది.
అధికారుల సర్వే పూర్తి
రిజర్వ్, సాధారణ, ప్రైవేట్ మూడు రకాలైన అటవీ ప్రాంతాలుంటాయన్నది తెలిసిందే. రిజర్వు అటవీ ప్రాంతం ప్రత్యేక విధి విధానాలతో ఉండనుండగా అటవీ భూములకే పరిమితం. ప్రైవేట్ అడవి ప్రైవే ట్ వ్యక్తుల పరిధిలోకి వస్తుంది. సాధారణ అడవి ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది. ఈ భూములు రెవెన్యూ శాఖ పరిధిలోనివా? అటవీ శాఖ పరిధిలో నివా అనేది తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఛాయచిత్రాల ద్వారా లెక్క తీస్తున్న భూములు సాధారణ అటవీ ప్రాంతాల్లోనివి కావడంతో భవిష్యత్తులో నిర్వహించే సంయుక్త సర్వేకు ఉపయోగపడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా విస్తీర్ణం:
2,125 చదరపు కిలోమీటర్లు
అటవీ విస్తీర్ణం: 793.80 హెక్టార్లు
మొత్తం విస్తీర్ణంలో
అడవుల శాతం: 0.30శాతం
జనాభా: 10.25లక్షలు