
జీతం బల్దియాలో.. పని ప్రైవేట్‌లో!
● ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ వ్యవహారం ● మూడు నెలలుగా కాంట్రాక్టర్ వద్దే విధులు
కరీంనగర్ కార్పొరేషన్: ఆ వర్క్ ఇన్‌స్పెక్టర్ జీతం తీసుకునేది కరీంనగర్ నగరపాలకసంస్థలో. పనిచేసేది మాత్రం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద. గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. కొంతమంది అధికారుల అండదండలతో సదరు వర్క్‌ఇన్‌స్పెక్టర్ సేవలు ప్రైవేట్‌లో తరిస్తున్నట్లు సమాచారం. నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులకు వర్క్ ఇన్‌స్పెక్టర్లు సహాయకులుగా పనిచేస్తుంటారు. ఔట్‌సోర్సింగ్ కింద నియామకం అయ్యే వర్క్ ఇన్‌స్పెక్టర్లు ప్రతి ఏఈ పరిధిలో దాదాపు నలుగురు ఉంటారు. నగరపాలకసంస్థ 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు పెరిగిన తరువాత అధికారులు, ఉద్యోగులపైన కూడా పనిభారం పెరిగింది. ఏ అధికారి, ఉద్యోగి ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఇదిలాఉంటే సుడా నిధులతో నగరంలోని ఓ పార్క్‌లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ వద్ద సదరు వర్క్ ఇన్‌స్పెక్టర్ పనిచేస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. గత మూడు నెలలుగా పార్క్‌లో కాంట్రాక్టర్‌కు సంబంధించిన పనులు చక్కబెడుతూ, నగరపాలకసంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఉన్నతాధికారులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా నగరపాలకసంస్థలో కొనసాగుతున్న ఇష్టారాజ్య వ్యవహారాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
బదిలీల్లో ఆ పేర్లుండవ్
నగరపాలకసంస్థలోని వర్క్ ఇన్‌స్పెక్టర్లను అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 20 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను ఏఈలకు అసిస్టెంట్లుగా, ఒకరిని వాహన నిర్వహణకు కేటాయించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగిన ప్రతిసారి నలుగురి పేర్లు మాత్రం అందులో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో పనిచేసే ఆ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు లేకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశామని, కార్యాలయంలో పనిచేస్తున్నందునే వారిని బదిలీ చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.