
నిరుపేదలకు కడుపునిండా బువ్వ
శంకరపట్నం/మానకొండూర్/రామడుగు/కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఇన్‌చార్జి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో, రామడుగు మండలం షానగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పలువురు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో విశాల సహకార పరపతి సంఘ నూతన భవనం, షాపింగ్ కాంప్లెక్స్, సంఘ వ్యవస్థాపకుడు అనభేరి వెంకటరమణారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో చేపడతామని, గోదావరి జలాలు చొప్పదండి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పౌరసరాపరాలశాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, గట్టుదుద్దెనపల్లి సొసైటీ చైర్మన్ అనభేరి రాధా కిషన్‌రావు, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రులకు ఘనస్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌కు స్పోర్ట్స్‌స్కూల్‌లోని హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్‌డీవో మహేశ్వర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వెలి చాల రాజేందర్‌రావు ఘన స్వాగతం పలికారు.
స్కూటీని ఢీకొన్న మంత్రి
కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం
కేశవపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం మంత్రుల కాన్వాయ్‌లోని ఓ పోలీస్‌వాహనం స్కూటీని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యా యి. కేశవపట్నంకు చెందిన చల్ల వెంకటి సాయంత్రం స్కూటీపై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మంత్రుల కాన్వాయ్ అదే రోడ్డుమీదుగా వెళ్తోంది. కాన్వాయ్‌లోని ఓ పోలీస్ వాహనం స్కూటీని తప్పించే క్రమంలో రోడ్డు కిందకు వెళ్లింది. రోడ్డు పక్క బండరాయికి తాకి ముందుటైర్లు పగిలిపోయాయి. అదుపు తప్పి స్కూటీకి తగిలింది. గాయపడిన వెంకటిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మూడు పంటలకు సాగునీరు
రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్‌లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రామడుగు, శంకరపట్నంలో రేషన్‌కార్డులు పంపిణీ
గట్టుదుద్దెనపల్లిలో సొసైటీ నూతన భనవం ప్రారంభం

నిరుపేదలకు కడుపునిండా బువ్వ