
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం
సాక్షి, పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీపంలోని హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.40లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ప్రాథమిక అంచనాలు సిద్ధం..
ప్రతిపాదిత ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ అధికారులతో కలిసి గతంలోనే పరిశీలించి సమీక్షించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి..? ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి..? ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని..? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్ర తిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వ చ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది.