
ఏది నిజం..?
● హైదరాబాద్ ‘సృష్టి’ ఘటనతో ఐవీఎఫ్‌లపై అనుమానాలు ● ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా సంతాన సాఫల్య కేంద్రాలు ● అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు
కరీంనగర్‌టౌన్: అమ్మానాన్న కావాలనేది దంపతులు కల. సహజ సిద్ధంగా సాధ్యం కాని పరిస్థితుల్లో దత్తత విషయంలోనూ విముఖత చూపుతూ... ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) వైపు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ ‘సృష్టి’ ఘటన ఉమ్మడి జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా సంతానం పొందిన దంపతుల్లో కలకలం సృష్టించే పరిస్థితి నెలకొంది. ఐవీఎఫ్‌కు వెళ్లాలనుకునే దంపతులు ఏది నిజం.. ఏది అబద్ధం.. అని తెలుసుకునే పరిస్థితి నెలకొంది.
శాసీ్త్రయమా... అశాసీ్త్రయమా?
ఐవీఎఫ్ సంతానం లేని దంపతులకు వరం లాంటి ది. ఈ పద్ధతితో చాలా మంది తల్లిదండ్రులు అవుతున్నారు. అయితే దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండం ద్వారా పిల్లలను కంటే ఇబ్బంది లేదు. కానీ ఉమ్మడి జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాలు శాసీ్త్రయ పద్ధతిలో చికిత్సలు అందిస్తున్నా యా.. లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంగా ఐవీఎఫ్ సెంటర్లు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లిలో ఒకటి, జగిత్యాలలో ఒకటి చొప్పున కేంద్రాలున్నాయి. పిల్లలు లేని జంటలే లక్ష్యంగా కేంద్రాల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఫలితం లేకపోతే తమ తప్పేంలేదని చేతులు దులుపుకుంటుండడం దంపతుల కన్నీటికి కారణమవుతోంది.
కమీషన్లతో వ్యవహారం
వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం లేని దంపతులే టార్గెట్‌గా నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వంటి పేర్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటే బిడ్డ జన్మించడం గ్యారంటీ అని నమ్మిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి దంపతులు సంతానంపై ఆశతో వస్తున్నారు. దంపతులను పంపిస్తే ఆర్‌ఎంపీలు, వైద్యులకు కమీషన్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.
‘సక్సెస్ రేట్’ అంతంతే!
దంపతుల్లో సంతాన లేమికి అనేక కారణాలు ఉంటాయి. దంపతులెవరైనా సంతానంలేదని వస్తే వైద్యులు అందుకు కారణాలను నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ.. చికిత్స చేస్తే సంతానం గ్యారంటీ అని నమ్మబలికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో సక్సెస్ అంతంత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతుండగా, సెంటర్ల నిర్వాహకులు ఆదాయమే లక్ష్యంగా చికిత్స చేస్తున్నారని సమాచారం.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఇప్పటికే ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేపట్టాం. నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తప్పవు. అమాయకులైన దంపతులకు హానీ కలిగించేలా వ్యవహరించొద్దు. అనుమతి ఉన్న సెంటర్ల నిర్వాహకులైనా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. జిల్లాలోని అన్ని సెంటర్లను తనిఖీ చేసి నిబంధనల అమలును పరిశీలిస్తాం.
– వెంకటరమణ, డీఎంహెచ్‌వో, కరీంనగర్

ఏది నిజం..?