
ప్రమాదకారక డ్రైవర్లకు శిక్షణ
● ఆర్టీసీ ఆర్‌ఎం రాజు
కరీంనగర్: మేజర్, మైనర్ ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బస్‌స్టేషన్‌లో మేజర్, మైనర్ ప్రమాదాలకు కారణమైన ఆర్టీసీ డ్రైవర్లకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎం మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డ్రైవర్లు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడంలో డ్రైవర్లదే కీలకపాత్ర అని అన్నారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ జి.గిరిసింహారావు మాట్లాడుతూ, ప్రమాదాల నియంత్రణలో డ్రైవర్ల ఆరోగ్యం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగి వుంటుందన్నారు. ఆరోగ్యంపై ప్రభావం చూపే మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలకు డ్రైవర్లు దూరంగా ఉండాలని సూచించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) పి.మల్లేశం ప్రమాదాలు నియంత్రణపై సూచనలిచ్చారు. 41 మంది డ్రైవర్లతోపాటు సేఫ్టీ వార్డెన్స్ టి.కొమురయ్య, సీహెచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.