ఆగని గొర్రెల మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): బొమ్మారెడ్డిపల్లిలో అస్వస్థతకు గురైన గొర్రెల్లో ఆదివారం ఉదయం వరకు 99 మృత్యువాతపడినట్లు గొర్రెలకాపరులు తెలిపారు. కొమ్ము కనకయ్య, రాజేశం, రేచవేని మల్లేశం, సమ్మెడ కొమురయ్య, గాడి నాగయ్యకు చెందిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గ్రామశివారులో కోసిన వరిపొలంలో గొర్రెల మంద మేతకు వెళ్లి అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈక్రమంలో శనివారం 48 మృత్యువాతపడగా.. ఆదివారం ఉదయం వరకు వాటి సంఖ్య 99కి చేరింది. మరికొన్ని అస్వస్థతతో బాధపడుతున్నాయి. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ఆదివారం గొర్రెలకాపరులను పరామర్శించారు. గొర్రెల మృతికి గల కారణాల గురించి పశువైద్యాధికారి అజయ్‌ను అడిగి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు యసోద అజయ్, మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


