వేర్వేరుగా సన్న, దొడ్డు వడ్ల కొనుగోళ్లు
● నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు ● ఏఈవోలకే కీలక బాఽధ్యత ● 15లోపు అన్ని కేంద్రాలు ప్రారంభం
కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. శుక్రవారం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించగా.. చొప్పదండిలో ప్రారంభించనున్నారని సమాచారం. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించడంతో అన్నదాతలు సన్న ధాన్యానికే ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ గణాంకాలు చాటుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ పౌరసరఫరాల, వ్యవసాయ, ఐకేపీ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకాలు కొనుగోళ్లలో భాగస్వామ్యమవనుండగా ఇక ఏఈవోలే ప్రధాన భూ మిక పోషించనున్నారు. కాగా యాసంగి ధాన్యం సేకరణకు గానూ 347 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల 15వరకు అన్ని కేంద్రాలను ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగళారపు రజనీకాంత్ స్పష్టం చేశారు.
అత్యధిక విస్తీర్ణం ఇక్కడే
సన్నరకాలను హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, వీణవంక మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, సైదాపూర్ మండలాల్లో దొడ్డురకం అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. కాగా సన్న ధాన్యానికి ఏ గ్రేడ్ రకం మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 అదనంగా ఇవ్వనున్నారు. జిల్లాలో 70,500 ఎకరాల్లో సన్నరకం సాగవగా 1.90లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుంది. సీడ్ మిల్లులకు పోనూ మార్కెట్‌కు వస్తుందని అంచనా.
గన్నీ సంచులు, రవాణే సమస్య
జిల్లాలో 347కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సి ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం, మిల్లర్ల దోపిడీ సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు కురుస్తుండటంతో నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందుకు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తుడిచేస్తోంది. గత సంవత్సరం వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయించేవరకు ఎలా గడుస్తుందోనన్న భయం వెంటాడుతోంది.
జిల్లాలో సాగువిస్తీర్ణం: 2,90,000
సాగైన వరి: 2,66,896 ఎకరాలు
రానున్న దిగుబడి: 6లక్షల క్వింటాళ్లు
మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,320
సాధారణ రకం: రూ.2,300


