నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా | - | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

Apr 11 2025 1:04 AM | Updated on Apr 11 2025 1:04 AM

నాలుగ

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

కొండాపూర్‌ ఎన్‌కౌంటర్‌కు 40 ఏళ్లు

సీపీఐ(ఎంఎల్‌) జనశక్తికి తొలి ఎదురుదెబ్బ

ఐదుగురు నక్సలైట్ల మృతి.. తప్పించుకున్న ఒకరు

సంఘటన స్థలానికి వచ్చిన అప్పటి మాజీ సీఎం

రుద్రంగిలో నిర్మించిన కొండాపూర్‌ అమరుల స్మారక స్తూపం

రుద్రంగిలో స్మారకస్తూపం

కొండాపూర్‌ అమరుల స్మారకార్థం 1991లో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య నాయకత్వంలో రుద్రంగిలో నిర్మించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య 1989లో జనశక్తి నక్సలైట్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. రుద్రంగిలోని ఆ స్థూపంపై కొండాపూర్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల పేర్లు ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు ఇన్‌ఫార్మర్‌గా పేర్కొంటూ వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశంగౌడ్‌ను అదే పెంటివాగు సమీపంలో జనశక్తి నక్సలైట్లు ఆ తరువాత కొద్ది రోజులుగా హతమార్చారు. అప్పటికే వెంకట్రావుపేటలో పోలీస్‌క్యాంపు ఉండగానే మల్లేశంగౌడ్‌ హత్య జరిగింది.

ఎన్‌కౌంటర్‌ మృతుడు: గొట్టె కిరణ్‌ దళనేత(ఫైల్‌)

సిరిసిల్ల:

రెండున్నర దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అడవిలోని అన్నలదే రాజ్యం. సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి విప్లవ గ్రూపులు తమకు పట్టున్న ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించాయి. అప్పట్లో నక్సలైట్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా ఉండేది. ఈతరం వారికి నక్సలైట్లు అంటే.. ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పటి సమాజంలో అన్యాయాన్ని ఎదిరించేందుకు పుట్టుకొచ్చిన విప్లవోద్యమాల ప్రతినిధులే నక్సలైట్లు. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ ఘటన సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి (చండ్రపుల్లారెడ్డి గ్రూప్‌) నక్సలైట్ల చరిత్రలో నెత్తుటిగాయంగా మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం కొండాపూర్‌–వెంకట్రావుపేట శివారులోని పెంటివాగు పక్కన 1985 ఏప్రిల్‌ 11న అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. ఆ ఎన్‌కౌంటర్‌ నుంచి ఒక్కరు తప్పించుకొని.. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌ గురించి పూసగుచ్చినట్లు చెప్పడం సంచలనంగా మారింది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని చూసేందుకు కొండాపూర్‌కు వచ్చారంటే దాని ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.

రక్తపుటేరుగా పెంటివాగు

కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటం కేంద్రంగా ఆవిర్భవించిన నక్సలైట్ల ఉద్యమం అప్పుడే పల్లెలకు విస్తరిస్తోంది. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దళనాయకుడు గొట్టె రఘుపతి అలియాస్‌ కిరణ్‌, మరో దళనాయకుడు చెట్కూరి నారాయణగౌడ్‌ అలియాస్‌ రామన్న(అక్కపల్లి), దళసభ్యులు పణి సత్తయ్య(మల్కపేట), తాడి రాజయ్య(వెంకట్రావుపేట), లక్ష్మీరాజం(వెంకట్రావుపేట), దాసరి గంగారాం(రుద్రంగి) సాయుధులు. వెంకట్రావుపేటలో జనశక్తి పార్టీ సానుభూతిపరుడి వద్ద రాత్రి భోజనం చేసి కొండాపూర్‌ సమీపంలోని పెంటివాగు పక్కనే బావి గడ్డ వద్ద నిద్రపోయారు. ఈ విషయం అందుకున్న సిరిసిల్ల సీఐ యూసుఫ్‌ షరీఫ్‌, వేములవాడ ఎస్సై ప్రాన్సిస్‌, సిరిసిల్ల ఎస్సై మురళీధర్‌రావు, కోనరావుపేట ఎస్సై వీరస్వామిగౌడ్‌లు సాయుధ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దళనేత కిరణ్‌తోపాటు మరో నలుగురు దళసభ్యులు మరణించారు. ఇంకో దళనేత చెట్కూరి నారాయణగౌడ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు. శవాలను మృతుల బంధువులకు ఇవ్వకుండా అక్కడే మర్రిచెట్టు కిందనే పోస్టుమార్టం చేసి పోలీసుల పర్యవేక్షణలో పెంటివాగులో దహనం చేశారు.

ఘటన స్థలికి మాజీ సీఎం, పౌరహక్కుల సంఘాల నేతలు

కొండాపూర్‌ ఎన్‌కౌంటర్‌ స్థలానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు, పౌరహక్కుల సంఘం నాయకులు రమామేల్కోటే, కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, దామోదర్‌రెడ్డిలు వచ్చారు. పోలీసుల తీరు, అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో ప్రత్యక్ష సాక్షి రహస్యంగా బతికి ఉండడంతో పోలీసులు డిఫెన్స్‌లో పడ్డారు.

మూడు రోజులకు కలకలం

పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకున్న జనశక్తి దళనేత నారాయణగౌడ్‌ అలియాస్‌ రామన్న ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లుగా తెలపడంతో ఆ కాలంలో దినపత్రికల్లో ధారావాహికంగా కథనాలు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు రాత్రి తప్పించుకున్న నారాయణగౌడ్‌ అదే రోజు రాత్రి గద్దెగట్టు చెరువుతూమ్‌ వద్ద నీరు తాగి, రక్తం ఎక్కువగా కారిపోకుండా రేగడి మట్టితో కట్టువేసుకుని అక్కడి నుంచి శివంగాళపల్లి వరకు నడుచుకుంటూ చేరుకున్నాడు. అక్కడి నుంచి జనశక్తి సానుభూతిపరుడి సాయంతో సైకిల్‌పై వేములవాడ మండలం మారుపాకకు చేరుకుని, మరో దళనేత బోడ లక్ష్మారెడ్డి అలియాస్‌ భూపతిరెడ్డిని కలిసి జీపులో వరంగల్‌కు, అటు నుంచి అటే ఖమ్మంకు చేరుకున్నాడు. అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడో రోజు నుంచే ఆ ఎన్‌కౌంటర్‌కు ఎలా జరిగిందనే విషయాన్ని అప్పటి పత్రికలకు వివరిచారు. నారాయణగౌడ్‌ తరువాత రామన్నపేరుతో అజ్ఞాతంలో పనిచేస్తూ గల్ఫ్‌కు వెళ్లి వచ్చి కోనరావుపేట మండలం ధర్మారంలో స్థిరపడి అనారోగ్యంతో తొమ్మిదేళ్ల కిందట మరణించాడు.

నేను ఆ రోజు రంగంపేటలో ఉన్న

మాది వెంకట్రావుపేట. నేను అప్పటికే జనశక్తిలో చంద్రశేఖర్‌ పేరుతో దళనేతగా పనిచేస్తున్నాను. ఆ ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నేను రంగంపేటలో ఉన్న. చెట్కూరి నారాయణ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్‌కౌంటర్‌ తరువాత కూడా ఆయన మళ్లీ పనిచేశారు. ఆ ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగిందో నారాయణ వివరంగా చెప్పారు. 1991లో నేను సిరిసిల్లలో అరెస్ట్‌ అయ్యాను.

– ఇటిక్యాల నర్సయ్య,

జనశక్తి మాజీ దళనేత

నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను

కొండాపూర్‌ ఎన్‌కౌంటర్‌కు ముందు నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను. నేను సిరిసిల్లలో ఎస్సైగా ఉండగా ఆ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పటి ఎస్పీ అశోక్‌ప్రసాద్‌ ఆదేశాలతో అక్కడే పోస్టుమార్టం చేయించాం. కొండాపూర్‌ ఎన్‌కౌంటర్‌ అప్పట్లో సంచలనమే.

– ముళీధర్‌రావు, అప్పటి సిరిసిల్ల ఎస్సై,

ప్రస్తుతం రిటైర్డు ఏఎస్పీ

భయం గుప్పిట్లో పల్లెలు

ఆ ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు వరికోతలు ఉండేవి. నేను వెంకట్రావుపేటలో సర్పంచ్‌గా ఉ న్నాను. ఆ రోజుల్లో పల్లెల్లో ఎంతో భయం ఉండేది. ఎ ప్పుడు ఏం జరుగుతుందో తె లియని పరిస్థితి. మా గ్రామపంచాయతీలోనే పో లీస్‌క్యాంపు ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసుల రక్షణ ఉండేది. వైర్‌లెస్‌ సెట్లు ఉండేవి. వెంకట్రావుపేట–కొండాపూర్‌ మధ్య జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌ను ఆ కాలం వారు ఎప్పటికీ మరిచిపోరు.

– పల్లం నర్సయ్య, మాజీ సర్పంచ్‌, వెంకట్రావుపేట

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా1
1/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా2
2/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా3
3/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా4
4/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా5
5/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా6
6/6

నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement