● అర్హులందరినీ ఓటర్లుగా
నమోదు చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. జిల్లాలో జరగనున్న సర్ ప్రక్రియపై కలెక్టరేట్‌లో సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
25 నుంచి ఇంటింటికి..
సర్‌లో భాగంగా ఈనెల 25 నుంచి వచ్చేనెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫాంలను పంపిణీ చేసి, ఓటర్ల వివరాలను సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆ పత్రాలను నింపి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్‌ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


