కామారెడ్డి టౌన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్ సాధారణ బదిలీపై హైదరాబాద్ వక్ఫ్ ట్రిబ్యునల్‌కు వెళ్తున్న సందర్భంగా సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి, సిబ్బంది జిల్లా జడ్జిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో న్యాయ సేవల విస్తరణకు, లోక్ అదాలత్‌ల విజయవంతమైన నిర్వహణకు వరప్రసాద్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. నిరంతరం న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడంలో ఆయన విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి.చంద్రసేన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాన్, టైపిస్టులు శ్రావణ్, సంధ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టం ఆఫీస్ అసిస్టెంట్లు సాయిప్రణీత్, ఉదయజ్ఞాని, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.ముక్తిదా
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.ముక్తిదా రానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆమె సాధరణ బదిలీపై జిల్లాకు రానున్నారు.


