యమకంకర రోడ్డు ఇది.. | - | Sakshi
Sakshi News home page

యమకంకర రోడ్డు ఇది..

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

త్వరలో పూర్తి చేయిస్తాం

మూడేళ్లు అవుతున్నా పూర్తి కాని

బీటీ రోడ్డు

పట్టించుకోని అధికార యంత్రాంగం

కంకర తేలి ప్రమాదకరంగా మారిన రోడ్డు

ఎల్లారెడ్డి: గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు దారుణంగా తయారయ్యాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన వెల్లుట్ల–గండివేట్‌ బీటీ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు పనుల కోసం కంకర వేసి ఏడెనిమిది నెలలు కావస్తున్నా బీటీ వేయకపోవడంతో ఆ దారి ప్రమాదకరంగా తయారైంది.

ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామం నుంచి గండివేట్‌ శివారు వరకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా సుమారు 4 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 2023, జూన్‌లో కోటి 49 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్లలో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిధుల విడుదలలో జాప్యం కారణంగా అర్థాంతరంగా రోడ్డు పనులు వదిలేసి పత్తా లేకుండా పోయాడు. అనంతరం 2025 నవంబర్‌లో వేరే కాంట్రాక్టర్‌కు రోడ్డు నిర్మాణ పనులను ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్పగించింది. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ ఆ రోడ్డు మీద కంకర వేశారు. రోడ్డుపై కంకర వేసి 8 నెలలు కావస్తున్నా నిర్మాణ పనులు చేపట్టడం లేదు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బీటీ(తారు) ధరలు రెండింతలు అయ్యాయని మొదట చేసిన అగ్రిమెంటుకు తనకు రోడ్డు వేయడం సాధ్యం కాదని చేతులెత్తేశాడని తెలిసింది. ఎల్లారెడ్డి మండలం నుంచి గండివేట్‌, గాంధారి వెళ్లే ప్రయాణికులు, రైతులు, గ్రామస్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై వేసిన కంకర ప్రమాదకరంగా మారింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర కంకర తేలిన రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురువుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఈ విషయమై తక్షణం స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయించాలని వారు కోరుతున్నారు.

ఎనిమిది నెలలుగా ఆగిపోయిన వెల్లుట్ల–గండివేట్‌ రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తాం. యుద్ధం కారణంగా బీటీ ధర పెరగడం కారణంగా కాంట్రాక్టర్‌ పనులను కొద్ది రోజులు వాయిదా వేశారు. ఈ విషయమై ఆయనతో చర్చించగా త్వరలో పూర్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. –నారాయణ,

డిప్యూటీ ఈఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, ఎల్లారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement