● కానిస్టేబుల్ కృష్ణసాగర్ పితృభక్తి
నాన్నే దేవుడు..!
గుండెల్లో నాన్న... పొలంలో గుడి..!
డొంకేశ్వర్(ఆర్మూర్) : లోకం విడిచి వెళ్లినా తన గుండెల్లో ఉన్న నాన్నకు గుడి కట్టించి ఆరాదిస్తున్నాడు డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కృష్ణసాగర్. వివరాల్లోకి వెళ్తే.. కీ.శే. కీని నల్ల రాజన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన రాజన్న 2018 అక్టోబర్ 3న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన హఠాన్మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే తండ్రి బతికుండాగానే చిన్న కుమారుడు కృష్ణసాగర్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. కొడుకుని ఖాకీ దుస్తుల్లో చూసి రాజన్న మురిసిపోయేవాడు. తండ్రి భౌతికంగా దూరమైనా ఎప్పటికీ తమలోనే ఉండాలనే సంకల్పంతో కృష్ణసాగర్ తన వ్యవసాయ క్షేత్రంలో రాజన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కని గుడి కట్టించాడు. ప్రతి ఏటా తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన నాన్నకు ఎంత చేసినా తక్కువే, ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కానిస్టేబుల్ కృష్ణసాగర్ భావోద్వేగంతో పేర్కొన్నారు.


