వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేక..
కామారెడ్డి టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా, స్థానికంగానే ప్రసవాలు (డెలివరీలు) జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీ) ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల లేమి, అందుబాటులో లేని వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ప్రసవాలు జరగడం లేదు. ప్రసవ వేదన మొదలవగానే గర్భిణులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాసుపత్రికో, ఏరియా ఆస్పత్రులకో లేదా ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకో పరుగులు తీయాల్సి వస్తోంది. సుఖప్రసవాలు చేసే అవకాశం ఉన్నా.. స్థానిక ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, రాత్రి వేళల్లో సేవలు కరువవ్వడంతో పీహెచ్‌సీల లక్ష్యం నీరుగారుతోంది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది ఆర్థిక సంవ్సతరం ఎప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అందించిన అధికారిక ప్రసవాల నివేదికను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పీహెచ్‌సీలు, 2 యూపీహెచ్‌సీలు ఉండగా, అందులో సగానికి పైగా కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. కామారెడ్డి డివిజన్ పరిధిలోని బీబీపేట్, ఎర్రాపహాడ్, రాజంపేట్, దేవునిపల్లి, రాజీవ్‌నగర్ యూపీహెచ్‌సీలతో పాటు బాన్సువాడ డివిజన్ పరిధిలోని డోంగ్లి, నిజాంసాగర్, పుల్కల్, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఉట్నూర్, అలాగే బాన్సువాడ, కామారెడ్డి యూఎఫ్‌డబ్ల్యూసీ కేంద్రాల్లో గడిచిన ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రసవం కూడా జరగలేదు. ఈ కేంద్రాలన్నీ సున్నా’ ప్రసవాల గణాంకాలతోనే సరిపెట్టుకున్నాయి. చాలా పీహెచ్‌సీల్లో కేవలం పగటిపూట మాత్రమే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాత్రి, అర్ధరాత్రి వేళల్లో ప్రసవ వేదన వస్తే అక్కడ చూసేవారే కరువవుతున్నారు. దీంతో గర్భిణుల కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి జిల్లా కేంద్రానికి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో దారిలోనే ప్రసవాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు మాత్రమే చూస్తు పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్న ఘటనలూ ఉన్నాయి.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో.
జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలోనూ ఇదే ప రిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలతో పోలిస్తే సీహెచ్‌సీల లో వైద్యులు, సిబ్బంది ఎక్కువ. అలాగే మెరుగైన సౌకర్యాలు ఉన్నా ఇక్కడా తక్కువ సంఖ్యలోనే ప్రసవాలు నమోదవుతున్నాయి. ఏడాదిగా ప్రసవాల సంఖ్య చూస్తే మద్నూర్ సీహెచ్‌లో 70, బిచ్కుందలో 67, పిట్లంలో 57, గాంధారిలో 53, ఎల్లారెడ్డిలో 33, దోమకొండలో 12 ప్రసవాలు జరిగాయి.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. పీహెచ్‌సీల్లో గర్భిణులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, మందులు అందుబాటులో ఉంచాం. ప్రతి నెలా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఏవైనా హైరిస్క్ కేసులు ఉంటే మాత్రమే జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యాధికారులతో త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం.
– డాక్టర్ వెంకట్,
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
పీహెచ్‌సీల్లో సరైన వసతులు, వైద్యులు అందుబాటులో లేక గర్భిణులు జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఎంసీహెచ్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవాల కోసం వెళ్తున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంలో 3,654 ప్రసవాలు జరగ్గా, బాన్సువాడ ఎంసీహెచ్‌లో అత్యధికంగా 4,036 ప్రసవాలు జరిగాయి. అంటే రెండు ప్రధాన ఆసుపత్రుల్లోనే ఏకంగా 7,690 ప్రసవాలు జరగడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 15,441 సాధారణ, సీజరియన్‌లు అయ్యాయి.
ఎక్కడ.. ఎన్ని..?
జుక్కల్ పీహెచ్‌సీలో అత్యధికంగా 134 ప్రసవాలు జరగ్గా, భిక్కనూర్‌లో 43, మాచారెడ్డి 12, బీర్కూర్ 10, లింగంపేట్ 13, నాగిరెడ్డిపేట్ 12 ప్రసవాలను రెండంకెల ప్రసవాల సంఖ్యను దాటగలిగాయి. ఏడాదంతా సింగిల్ డిజిట్ ప్రసవాల సంఖ్యను మరో ఐదు పీహెచ్‌సీలున్నాయి. డివిజనల్ పరిధిగా పీహెచ్‌సీలలో ఏడాది కాలంగా చేస్తే కామారెడ్డి డివిజనల్‌లో 62, బాన్సువాడలో 163, ఎల్లారెడ్డిలో 29 మాత్రమే ప్రసవాలు జరిగాయి. అంటే మొత్తం పీహెచ్‌సీలలో ఏడాది కాలంలో 254 ప్రసవాలు మాత్రమే జరిగాయి.
గ్రామీణ ప్రాంతాల్లో
మందగించిన‘డెలివరీ’ సేవలు
ఖాతా తెరవని పలు ప్రాథమిక
ఆర్యోగ్య కేంద్రాలు
సీహెచ్‌సీల్లోనూ తక్కువ సంఖ్యలో..
జిల్లా, ఏరియా ఆసుపత్రి, ప్రైవేటు
సెంటర్లకు గర్భిణుల పరుగులు


