● రైతులకు యాప్‌పై
అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : రైతులకు యూరియా స్టాక్ అందుబాటులో ఉండేలా ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్, సహకారశాఖ అధికారులతో కలెక్టర్ శనివారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. యూరియా యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని అన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు, అవసరాలు, సరఫరా పరిస్థితి వివరాలను తెలుసుకుని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్ ప్రతినిధులు, సహకార శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2.48 లక్షల బ్యాగుల యూరియా కొనుగోలు
వానకాలం సాగు పనులు ఊపందుకోవడంతో జిల్లాలో ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రత్యేక యూరియా బులిటెన్‌ను ఒక ప్రకటనలో విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 96,519 మంది రైతులు 2.48 లక్షల బ్యాగుల యూరియాను కొనుగోలు చేసి లబ్ధి పొందినట్లు వివరించారు. ఎరువుల నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే యూరియాను కొనుగోలు చేసుకోవాలని డీఏవో తెలిపారు.


