రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం | - | Sakshi
Sakshi News home page

రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కాసం వెంకటేశ్వర్లు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అప్పుల నుంచి బయటపడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. నాగిరెడ్డిపేట ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లో పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని, అప్పుడు ప్రజలు బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకుంటారన్నారు.

అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ..

ఇటీవల వెలువడిన కాగ్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాధ్యతలేని ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నాయకులకు తెలుసునని, అందుకే అధికారంలో ఉన్నప్పుడే దోపిడీకి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు అమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని చెప్పారు. ఆస్తుల విషయమై కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతోనే బీఆర్‌ఎస్‌ అంతమవుతుందని జోస్యం చెప్పారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన 200మంది బీజీపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్‌మోహన్‌రెడ్డి, హన్మాండ్లు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ భాస్కర్‌, నాయకులు నరేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement