మాచారెడ్డి: ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించకుంటే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయని గజ్యానాయక్ తండా సర్పంచ్ రావుల వినోద అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా తండాలోని ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆమె కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన,గుణాత్మక విద్య అందుతుందని అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి దేవి, ఉపాధ్యాయురాలు లత ఉన్నారు.
దోమకొండ: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ బదిలీ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు ఏ శాఖలో విధులు నిర్వహించినా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని.. అలాంటప్పుడే ఉద్యోగులు తృప్తి ఉంటుందన్నారు. అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సర్పంచులు, అధికారులు ఎంపీడీవోకు జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. తహసీల్దార్ స్వప్న, ఎస్సై ప్రభాకర్, ఎంఈవో విజయ్ కుమార్, ఎంపీవో రవికుమార్, ఏపీవో రజని, నాయకులు సీతారాం మధు, పులబోయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని శివాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె నాగరాజు తన ఇద్దరు పిల్లలు అక్షయ, అభినయ్‌లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్షయ ఎల్లారెడ్డి మోడల్స్ స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా, కుమారుడు అభినయ్ నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని కామారెడ్డి డీఆర్‌డీవో దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించారు. ఐకేపీ కార్యాలయాన్ని పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు, సిబ్బందితో మాట్లాడారు. రుణాలను సకాలంలో చెల్లించేలా సిబ్బంది చర్యలు తీసుకొని వసూలు చేయాలని సూచించారు. ఏపీఎం ప్రసన్న కుమార్, సిబ్బంది ఉన్నారు.


