పనులు నాణ్యతతో చేపట్టాలి
కామారెడ్డి క్రైం: విద్యతోనే భవిష్యత్‌కు బలమైన పునాది పడుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం ఆయన గర్గుల్‌లో బడిబాట కార్యక్రమంలో పాల్గొని యూకేజీ తరగతిని ప్రారంభించి, అక్షరాలు దిద్దంచారు. సంచార జాతుల పిల్లలను పాఠశాలలో చేర్పించి వారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో రెండు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గర్గుల్ పాఠశాలకు చెందిన నలుగురు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న 12 మంది క్రీడాకారులను సన్మానించారు.
ఇందిరమ్మ గృహాలకు భూమిపూజ..
గర్గుల్‌లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న రావుల పెద్ద ఎల్లమ్మ, భిక్షపతి, దానబోయిన జ్యోతిలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి నాణ్యతతో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ దివ్య, డీఈవో మల్లికార్జున్, తహసీల్దార్ హిమబిందు, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంఈవో ఎల్లయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న మరమ్మతు పనులు, పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ, స్వయం సహాయక సంఘాల భవనాలు, గోదాములు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, జీపీ భవనాల పనులపై శాఖలవారీగా సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గిరి, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, డీఈవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


