భూసార పరీక్ష.. పంటకు రక్ష | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్ష.. పంటకు రక్ష

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

సేంద్రియ ఎరువులు మేలు

పంటల మార్పిడితోనే ప్రయోజనాలు

పరీక్షలు చేయించుకోవాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

మద్నూర్‌(జుక్కల్‌): రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా ప్రతి రైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీంతో భూమిలోని పోషక విలువలు తెలుసుకోని రసాయన ఎరువులు వాడొచ్చు. భూసార పరీక్షలపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే పంటల మార్పిడిపై స్పష్టత వస్తుంది. దానికనుగుణంగా సాగుచేయొచ్చు. భూసార పరీక్షలు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు తగిన పంటలను సాగు చేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవగాహన లేమితో పంట నష్టాలు

రైతులు భూమిలోని పోషకాల స్థాయిని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. విరివిగా రసాయన ఎరువుల వాడకం వల్ల వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై రైతు సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ పదేపదే సూచనలు చేస్తోంది. అయినప్పటికి రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అలాగే భూసార పరీక్షల ఫలితాలను అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఫలితాల ఆధారంగా సాగు

మొక్కల పెరుగుదలకు 16 రకాల పోషకాలు అవసరమని, భూసార పరీక్షల ద్వారా భూమిలోని లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అవసరమైన మోతాదులో ఎరువులను వినియోగించడం వల్ల దిగుబడి పెంచుకోవచ్చు. కొందరు రైతులు ఒకే పంటను తరుచుగా సాగు చేస్తుండడంతో పాటు అధిక రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంది.

సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. ఈ పరీక్షలతో భూమి సారం ఎంతో తెలుస్తుంది. ఆ మేరకు భూమికి కావాల్సిన పోషకాలను అందించగలిగే ఎరువులు వాడుకునే అవకాశం ఉంటుంది. పంటల సాగులో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి.

–రాజు, ఏవో, మద్నూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement