గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామంలో సోమవారం ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నాగ్లూర్ గ్రామానికి చెందిన సుబ్బారావు, సోని దంపతులు ఉదయం వ్యవసాయా పనులకోసం పొలానికి వెళ్లారు. వారితోపాటు వారి కుమారుడు శ్రీమన్షు (07) కూడా వెళ్లాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తుండగా, బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదన్నారు.
నిజామాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. బీహార్ రాష్ట్రం, ఖగారియా జిల్లా, మారారు గ్రామానికి చెందిన బహేరి చౌదరి (48) వ్యక్తి కొన్ని రోజులుగా స్థానికంగా ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. మండలంలోని ఖానాపూర్ శివారులో సోమవారం సాయంత్రం బహేరి చౌదరి తన సైకిల్‌పై ఖానాపూర్ శివారులో ఉన్న కాపర్తి రైస్ మిల్‌లో పని చేయడానికి వెళ్తుండగా, రైస్‌మిల్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన పల్సర్ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈఘటనలో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్నేహితుడు సంజయ్ మండల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు.
ఒకరిపై దాడి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆస్మికాలనీలో ఒకరిపై దాడి జరిగిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. అజ్మత్‌ఖాన్ అనే వ్యక్తిపై ముజాయిద్‌ఖాన్ డబ్బుల కోసం దాడి చేసినట్లు తెలిపారు. అలాగే మరికొందరు కర్రలతో దాడిచేసి ద్విచక్ర వాహనంను ధ్వంసం చేసి డ్రెయినేజీలో పడవేసినట్లు తెలిపారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


