నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో తాపీమేసీ్త్రల భవన నిర్మాణం కోసం తమకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తాపీమేసీ్త్రలు శుక్రవారం స్థానిక తహసీల్దార్ భిక్షపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. మండలంలో తాము 125 మంది ఉన్నామని, చాలాకాలంగా తాపీమేసీ్త్రల భవన నిర్మాణ స్థలం కోసం నిరీక్షిస్తున్నామని వారు చెప్పారు. మండలకేంద్రంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బి.సిద్దిరాములు కుమార్తె నిమితను ఎస్పీ రాజేష్‌చంద్ర అభినందించారు.ఇంటర్‌లో వెయ్యికి 992 మా ర్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు పొందడం ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలన్నారు. పోలీసు కుటుంబాల పిల్లలకు నిమిత రాష్ట్రస్థాయి ర్యాంకు స్ఫూర్తినిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్‌లోని శివాజీ చౌక్ ఆవరణలో గల పశువుల తొట్టెను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. గ్రామంలో పశువులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడే పశువుల తొట్టెను అకారణంగా కూల్చివేసినట్లు వారు తెలిపారు. వారం రోజుల లోపు అదే స్థలంలో నీటి తొట్టెను నిర్మించాలని లేకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. గ్రామస్తులు నర్సింలుగౌడ్, హన్మాండ్లు, నాగేశ్ తదితరులున్నారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్ద తడ్గూర్‌లో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ శిబిరాన్ని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్ స్నేహ శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో గ్రామస్తులకు క్షయ వ్యాధి వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు, జ్వరం, రాత్రి పూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో క్షయ వ్యాధి నిర్ధారణ చేస్తారని, అనంతరం ఉచితంగా మందులు అందిస్తామన్నారు. టీబీ ప్రొగ్రామ్ అధికారి ప్రదీప్, డోంగ్లీ పీహెచ్‌సీ వైద్యులు శ్రీలేఖ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


