వ్యవసాయ వ్యర్థాలతో భూసారం!
పెర్కిట్(ఆర్మూర్): పొలంలోని వ్యవసాయ వ్య ర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం కోల్పో యి దిగుబడులు తగ్గుతాయి. కానీ చాలామంది రైతులు పంట చేతికొచ్చిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టి తర్వాత సాగుకు సిద్ధమవుతున్నారు. ఇలా వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు భూమి వేడెక్కి భూసారం దెబ్బతింటుంది. అలాకాకుండా వ్యవసాయ వ్యర్థాలను దమ్ముచేయడంతో భూసారాన్ని పెంచుకోవచ్చని ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు నలిమెల చిన్నారెడ్డి తెలియజేస్తున్నారు. పొలం కోసిన తర్వాత కొంత నీరు పెట్టి ఎకరాకు రెండు 50 కేజీల సూపర్ పాస్పేట్ మందును చల్లి దమ్ము చేసుకోవడం వల్ల వ్యర్థాలు భూమిలో కలిసి పోతాయి. నెల రోజుల పాటు అలాగే ఆరబెట్టిన అనంతరం చిన్న నాగలితో దున్నుకుని భూమిని మరో పంటకు సిద్దం చేసుకోవచ్చు. పంట నిడివి కాలం తక్కువగా ఉంటే పొలంలో నీటిని అలాగే ఉంచడం వల్ల వ్యర్థాలు కుళ్లిపోయి భూమిలో కలిసి పోతాయి. ఇలా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియబెట్టడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.


