
ఖరీఫ్ సాగుతోంది
కామారెడ్డి క్రైం : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 5.24 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగవవచ్చని భావించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో 1,95,423 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 51,802 ఎకరాల్లో సోయాబీన్, 32,552 ఎకరాల్లో మొక్కజొన్న, 17,713 ఎకరాల్లో పత్తి, 6,965 ఎకరాల్లో కంది, లక్షా 14 వేల ఎకరాలలో మిగతా పంటలు సాగయ్యాయి. మరో 40 వేల నుంచి 60 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నిజాంసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ముందుగానే వరినాట్లు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోరుబావుల కింద చాలామంది రైతులు నాట్లు వేశారు. సాగు నీటి వసతులు తక్కువగా ఉండే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలలో ఏటా వరి సాగు ఆలస్యంగానే జరుగుతుంది. ఆయా మండలాల పరిధిలో రైతులు ఇప్పుడు నాట్లు వేసే పనిలో ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే..
ఈసారి రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురిశాయి. ముందస్తుగా వర్షాలు కురియడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి వానాకాలంలో జూలై నాటికి జిల్లాలో పంటల సాగు బాగా పెరిగింది. జూలై చివరి నాటికి ఈసారి 4.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు తక్కువగా కురియడంతో రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేశారు. దీంతో ఆ ఏడాది జూలై నాటికి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి.
సూచనలు పాటించాలి..
జిల్లాలో ఇప్పటివరకు 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రైతులు తమ పంటల సాగులో ఏవైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. పంటల సాగులో అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి.
– మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డి
వానాకాలంలో భారీ వర్షాలు కురవకపోయినా ప్రస్తుతానికి జిల్లాలో పంటల సాగు ఆశాజనకంగానే ఉంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ప్రధానంగా సుమారు 2 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి. మరో 60 వేల ఎకరాలలో నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
పంటలకు ఢోకా లేనట్లే!
ఆశాజనకంగా సాగు పనులు
చివరి దశకు వరి నాట్లు
4.19 లక్షల ఎకరాల్లో పంటలు
భారీ వర్షాలు పడితేనే..
ఇప్పటివరకు సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదయ్యింది. సరైన వానలు లేకపోవ డంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. అడపాదడపా కు రిసిన వర్షాలతో కొద్దిమేర భూగర్భ జలాలు పె రిగి బోరు బావుల్లో ఊటలు పెరిగాయి. ఈ నీటి వనరులతో వానాకాలం పంటలకు ఢోకా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే యాసంగిపై ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురియకపోతే జలాశయాలు నిండే పరిస్థితులు కనిపించడం లేదు. వరుణుడు ముఖం చాటేస్తే యాసంగిలో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈనెలలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది అన్నదాతలకు ఊరటనిచ్చే అవకాశం.

ఖరీఫ్ సాగుతోంది