సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెరిగిన నిత్యావసరాల ధరలు ఏమాత్రం తగ్గకపోగా కూరగాయల ధరలు క్రమక్రమంగా పెరుగుతూ సామాన్యుడు కొనలేని పరిస్థితికి చేరుకుంటున్నాయి. కొన్ని కూరగాయల ధరలైతే ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మార్కెట్‌కు వెళ్లి ఏది కొందామన్నా పావు కిలోకు రూ.25 నుంచి రూ.30 దాకా పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో ధర రూ. వందకు చేరింది. నిన్నమొన్నటి దాకా టమాట ధర కిలోకు రూ.40 ఉండగా.. ఇప్పుడు రూ.70 వరకు అమ్ముతున్నారు. కాకరకాయ, బీరకాయలను కిలోకు రూ.80 నుంచి రూ. వంద వరకు అమ్ముతున్నారు. ఆకు కూరల ధరలూ పెరిగాయి. ఆకు కూరలు కిలోకు రూ.80 వరకు చేరాయి. మునగ కాయలు కూడా కిలోకు రూ.80కి అమ్ముతున్నారు. కొత్తిమీర మాత్రమే కాస్త చీప్‌గా దొరుకుతోంది. పది రూపాయలకు రెండుమూడు చిన్నచిన్న కట్టలు ఇస్తున్నారు. స్థానికంగా పంట తగ్గడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు శ్రావణ మాసం కావడం, శుభ ముహూర్తాల సమయం కావడం కూడా కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు.
ఉల్లిగడ్డ కూడా పిరమయ్యింది..
మార్కెట్‌లో ఉల్లిగడ్డ ధర కూడా పెరిగింది. పంట చేతికొచ్చిన సమయంలో కొంత తగ్గినట్టే తగ్గినా తిరిగి పుంజుకుంది. నెల క్రితం వరకు వంద రూపాయలకు ఐదారు కిలోలు ఇచ్చేవా రు. ప్రస్తుతం కిలోకు రూ.40 నుంచి రూ.50 దాకా అమ్ముతున్నారు. పచ్చళ్ల సీజన్‌లో ఎల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పటికీ అదే స్థాయి లో ఉంటున్నాయి. పెరిగిన ధరల మూలంగా మార్కెట్‌కు వెళితే కన్నీళ్లే వస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.
కిలోకు రూ. వంద దాటిన పచ్చిమిర్చి
బీర, కాకర కిలోకు రూ. 80..
టమాటతోపాటు ఇతర కూరగాయలదీ అదే దారి..
కొనడానికి ఇబ్బందిపడుతున్న
సామాన్యులు
సామాన్యుడి కష్టాలు రెట్టింపు...
మార్కెట్‌లో పెరిగిన ధరలతో సామాన్యుడి కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ ఆకాశానికి చేరాయి. ఉప్పు, పప్పులతో పాటు ఇతర నిత్యావసరాల ధరలన్నీ పెరిగి కూర్చున్నాయి. మటన్, చికెన్‌తో పాటు కోడి గుడ్డు ధరలదీ అదే దారి.. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వారానికోసారి మార్కెట్‌కు వెళ్లి రూ. వంద నుంచి రూ.150 పెడితే బస్తా నిండా కూరగాయలు వచ్చేవి. పెరిగిన ధరలతో అవే కూరగాయలకు రూ. 3 వందల నుంచి రూ.350 దాకా వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు మార్కెట్‌లో ధరలు చూసి రెగ్యులర్‌గా తీసుకునే కూరగాయలకు బదులు ఏది తక్కువ ఉందో అదే కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే నలుగురిని అడిగి, బేరమాడి కొంటున్నారు.
కూరగాయల ధరలకు రెక్కలు