
‘మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’
కామారెడ్డి అర్బన్: మహిళలు ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలు(ఎంఎస్‌ఎంఈ) ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. జిల్లాలోని స్వయంసహాయ సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికత్తలకు బుధవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. కొత్తగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వస్త్ర పరిశ్రమలు, ఆహార ఉత్పత్తులు, హస్తకళలకు వీ హబ్ ద్వారా ఆదాయం పెంచుకోవడానికి నైపుణ్య శిక్షణ, నిపుణుల సలహాలు, ప్రోత్సాహం అందించనున్నట్టు వీ హబ్ డైరెక్టర్ జాహీద్ షేక్ అన్నారు. వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ, డీఆర్‌డీవో ఎం.సురేందర్, జిల్లా పరిశ్రమల అధికారి లాలు నాయక్, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.