
నాన్నే.. నా హీరో
మా నాన్న ఎం.రాములు సహకార శాఖలో ఉద్యోగం చేసేవారు. గతేడాది చనిపోయారు. ఆయన లేకపోవడం నాకు ఎంతో లోటు. మా నాన్న గొప్ప మానవతావాది. ఆయనే నాకు రోల్ మోడల్. నా హీరో. ఏ పని అయినా బాధ్యతగా చేయాలని చెప్పేవారు. మా నాన్నను చూసే చాలా విషయాలు నేర్చుకున్నాను. నా పనితీరు విధానం నాన్నలాగే ఉంటుంది. సివిల్ సర్వీసెస్‌లో మూడుసార్లు సక్సెస్ కాలేకపోయాను. ఆ సమయంలో నా వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. మరో ప్రయత్నం చేయమంటూ ప్రోత్సహించారు. ఆయన అందించిన ప్రోత్సాహం, ఇచ్చిన ధైర్యం వల్లే సక్సెస్ అయ్యాను. మొదటి నుంచి ఆయన మా చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. ఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఈ సమయంలో ఆయన లేకపోవడం నాకు ఎంతో లోటు. ఆయన చిన్ననాటి నుంచి చెప్పిన మాటలన్నీ నా మదిలో మెదలుతూనే ఉంటాయి. – ఎం.రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
తండ్రితో ఎస్పీ రాజేశ్ చంద్ర
● నాన్నంటే వెన్నంటి నిలిచే ధైర్యం ● స్ఫూర్తి ప్రదాత, నిజమైన స్నేహితుడు ● నేడు ఫాదర్స్ డే
అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆ తర్వాత బిడ్డల భారం మోసేది నాన్న.. చిటికెన వేలు పట్టి నడిపిస్తూ... భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపిస్తాడు. ఎన్ని కష్టాలనైనా బిడ్డల కోసం భరిస్తాడు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఆనందాలనూ వదులుకుంటాడు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తాడు. వారు సాధించిన విజయాలను చూసి పొంగిపోతాడు. తమ భవిష్యత్ కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోయిన నాన్నే తమ హీరో అని, స్ఫూర్తి ప్రదాత అని చాలా మంది పిల్లలు చెప్పుకుంటున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మా నాన్న సంజీవరెడ్డి జిల్లా సహకార శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఇష్టంగా చదవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు నడవాలని చిన్నప్పటినుంచి మోటివేట్ చేసే వారు. చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాల నేవారు. ఆల్ ఇండియా సర్వీస్ సాధించి ప్రజలకు సేవ చేయాలనేవారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్న ఉద్దేశంతో ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో ఉద్యోగం సాధించాను. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఫెయిల్యూర్స్ వచ్చినపుడు ప్రయత్నించమని నాన్న ఎంతో సపోర్ట్ చేశారు. నాన్న సపోర్ట్ చేయడం వల్లే సాధించాను. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను తల్లిదండ్రులతో ఓపెన్‌గా షేర్ చేసుకోవాలి. మనం పడిపోతే పట్టుకునేది, అండగా ఉండేది పేరెంట్సే. వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన సమస్యలను ఓపెన్‌గా చెప్పుకోగలగాలి. పేరెంట్స్ కూడా ఆ ఫ్రీడం ఇవ్వాలి. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. – బి.చైతన్యరెడ్డి, ఏఎస్పీ, కామారెడ్డి
మా నాన్న క్రిషన్‌పాల్ సంగ్వాన్ హర్యానాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తన సర్వీసులో వేలాది మందిని తీర్చిదిద్దారు. నా జీవితానికి ఆయనే మార్గదర్శి. ఆయనే ప్రేరణ. ఆయన అందించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగాను. దయ, దాతృత్వం, ఔదార్యం వంటి విలువలన్నీ ఆయన నుంచే నేర్చుకున్నాను. నిస్వార్థంగా సేవ చేయాలని, అవసరం ఉన్న వారికి సాయం అందించాలని ఆయన చెప్పిన మాటలు నా మదిలో నిరంతరం మెదులుతూనే ఉంటాయి. నాన్న నాటిన విలువలు పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి నేను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నాను. నాన్న ఏడాదిలో సగం రోజులైనా నా వద్దకు వచ్చి ఉండి వెళతారు. నేను ఎదిగిన తీరును చూసి ఆయన సంతోషపడతారు. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి
నాన్నే రోల్ మోడల్..

నాన్నే.. నా హీరో

నాన్నే.. నా హీరో