విద్యార్థులతో మాట్లాడుతున్న స్పీకర్ పోచారం, కలెక్టర్ జితేష్ వి పాటిల్
బాన్సువాడ రూరల్ : ‘‘ఇదే పాఠశాలలో నేను 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నా.. రెండు గదులు, పూరిపాక ఉండేవి. ప్రతిసారి నేను ఫస్ట్ వచ్చేవాడిని..1954 నుంచి 1959వరకు చదువుకున్న సమయంలో నా గురువు మోజెస్ నన్ను చాలా ప్రోత్సహించేవారు’’ అంటూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మురిసిపోయారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. మంగళవారం బా న్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మన ఊరు –మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కామారెడ్డి కలెక్టర్ జీతేష్ వి పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఈరోజు ప్రారంభించిన పాఠశాలలో తాను చదువుకున్నట్లు కలెక్టర్ జీతేష్ వి పాటిల్, గ్రామస్తులకు తెలియజేశారు. తాను చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడినని, ఉదయం ప్రార్థన చదివించేవాడినన్నారు. గురువు మోజెస్ తనను ఇంగ్లిష్, గణితం బాగా చదివి భవిష్యత్‌లో ఇంజినీర్ కావాలని ప్రో త్సహించడంతో తాను ఇంజనీరింగ్ చేశానన్నారు. చదువుకునే రోజుల్లో రెండో క్లాస్ నుంచి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేవాడినన్నారు. నేను మీ పాఠశాలలోనే చదువుకున్నాను కాబట్టి మీరంతా నా స్కూల్‌మేట్స్ అంటూ చిన్నారులను ఉత్సాహపర్చారు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే కష్టపడి చదవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపేట్ సర్పంచ్‌గా ఉన్న నారాయణరెడ్డి తన బావమరిది అని వారి అక్క పుష్పను వివాహమాడి ఈ ఊరి అల్లుడిని అయ్యానన్నారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చదువుకున్న పాఠశాలలను తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
తాను చదువుకున్న పాఠశాలను
చూసి మురిసిన స్పీకర్ పోచారం
మీరంతా నా స్కూల్‌మేట్స్ అంటూ
చిన్నారులతో చిట్‌చాట్


