పల్లెలొక్కటై.. ఓటుకు జై | - | Sakshi
Sakshi News home page

పల్లెలొక్కటై.. ఓటుకు జై

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం కనిపించింది.. ఓటు హక్కును చాలామంది వినియోగించుకోవడంతో పోలింగ్‌ శాతం పెరిగింది. ఆదివారం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80. 94 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉదయం పోలింగ్‌.. మధ్యాహ్నం కౌంటింగ్‌

పెదపూడి, కాజులూరు, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో మొత్తం 149 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 20 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 129 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవుల కోసం అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. అదేవిధంగా వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోటీ నెలకొంది. ఆయా గ్రామాల్లో 3,98,805 ఓట్లు ఉండగా 3,22,817 మంది తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా, పురుషులే అధికంగా ఓటేశారు. 1,62,392 మంది పురుషులు, 1,60.423 మంది మహిళలు ఓటు సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు

కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 12వ వార్డు ఎన్నికకు సంబంధించి గుర్తు కేటాయింపుపై వివాదం తలెత్తింది. తనకు గౌను గుర్తు కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుతం కుక్కర్‌ గుర్తు అని చెబుతున్నారంటూ కోణారత్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఈ ఘటనలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.

కూటమి అభ్యర్థులకు మరోసారి సవాల్‌

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జిల్లాలో రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. అధికార కూటమి మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులకు పలు గ్రామాల్లో గట్టి పోటీ ఎదురైనట్లు ఎన్నికల సరళి స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాక కూటమిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలను ఓటర్లు అభ్యర్థుల ముందు ప్రస్తావించారు. కొన్ని గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించగా, మరికొన్ని చోట్ల కూటమి మద్దతుదారులు గట్టి పోటీని ఎదుర్కొన్నారు. దీంతో అధికార కూటమి నాయకత్వానికి గ్రామీణ స్థాయిలో ప్రజాభిప్రాయం మరోసారి సవాల్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు తమ అభ్యర్థుల విజయానికి విస్తతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో ఓటర్ల తీర్పు రాజకీయ పార్టీల అంచనాలకు భిన్నంగా వచ్చాయి.

చిత్రాడ గ్రామ కౌంటింగ్‌ కేంద్రంలో

ఓట్లు లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది

పిఠాపురం మండలం చిత్రాడలో

ఓటు వేసేందుకు క్యూలో ఉన్న మహిళలు

ఫ ప్రశాంతంగా

రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఫ జిల్లాలో 80.94 శాతం పోలింగ్‌

ఫ కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ

ఫ వైఎస్సార్‌ సీపీ

మద్దతుదారుల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement