సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాయుడు నాగమణి, ఆమె భర్త రాయుడు మోజేష్ బాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కాకినాడలోని కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి భర్త వెలుగుబంటి వెంకటరమణతో పాటు పలువురు ఓటర్లకు మద్యం, స్వీట్లు, నగదు, చీరలు పంపిణీ చేసి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టిన ఫొటోలు, వీడియోలను వారు మీడియాకు చూపించారు. దీనిపై ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. సామర్లకోట జెడ్పీటీసీ స్థానాన్ని ఇప్పటివరకు బీసీలకు రిజర్వు చేయలేదని, పనసపాడు పంచాయతీలో సర్పంచ్ పదవి మినహా వార్డు సభ్యుల స్థానాలకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులో లోపాలను సరిచేయాలని కోరారు.


