నేడే ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

నేడే ఓట్ల లెక్కింపు

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

ఫలితాలపై ఉత్కంఠ

కాకినాడ లీగల్‌: కాకినాడ నగరపాలక సంస్థ పీఠం ఎవరిని వరిస్తుందనేది సోమవారం తేలనుంది. ఇప్పటికే బ్యాలెట్లలో ఓట్ల రూపంలో అభ్యర్థుల భవితవ్యం ఉంది. స్థానిక పరిధిలోని 66 వార్డులకు సంబంధించి 306 పోలింగ్‌ స్టేషన్లలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో మూడు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 132 కౌంటింగ్‌ టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కౌంటింగ్‌ హాల్‌లో కౌన్సిల్‌ సభ్యులతో పాటు మేయర్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలకు అనుమతించాలని సూచించారు. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు, ఫలితాల నమోదు, ధ్రువీకరణ తదితర ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఫ తేలనున్న నగరపాలక భవితవ్యం

ఫ పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు

కాకినాడ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌ స్థానాలకు 323 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 2,85,950 ఓటర్లకు 1,67,407 మంది వినియోగించుకున్నారు. దీంతో 58.52 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మేయర్‌, 66 డివిజన్ల కార్పొరేటర్‌ స్థానాలకు కలిపి మొత్తం 132 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement