చైర్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

చైర్‌ వార్‌

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

లో

గొల్లప్రోలులో గగ్గోలు

గొల్లప్రోలు నగర పంచాయతీలో తానే చైర్మన్‌ అవుతానని ఓ టీడీపీ నేత భావించారు. రిజర్వేషన్‌ సైతం ఆయనకు అనుకూలంగా తెచ్చుకునేందుకు ప్రయత్నించి, సఫలమైనట్లు సమాచారం. అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో గొల్లప్రోలు పీఠాన్ని సైతం జనసేన ఆశించడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంత పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గమైనా.. తమ పార్టీ నేతలకు పదవులు ఉండకూడదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

కాకినాడ మేయర్‌ సైతం..

కాకినాడ నగర మేయర్‌ స్థానాన్ని సైతం జనసేన ఆది నుంచీ ఆశిస్తోంది. ఈ సీటు తమకే ఖాయమని ఆ పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటనలు గుప్పించారు. రిజర్వేషన్‌ ఓసీ జనరల్‌ అవుతుందని భావించి, కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతిని బరిలోకి దింపే యోచన చేశారు. అయితే, రిజర్వేషన్‌ తారుమారు కావడంతో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. తిరిగి అభ్యర్థిని వెతికే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం మేయర్‌ పీఠం తమదేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

జెడ్పీపై పీటముడి

రిజర్వేషన్ల తారుమారుతో కాకినాడ మేయర్‌ సీటు చేజారడంతో.. బార్లపూడి క్రాంతిని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బరిలోకి దింపేందుకు జనసేన నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కాకినాడ మేయర్‌ పదవి జనసేనకు వెళ్తే, జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ భార్యను బరిలోకి దింపాలని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. తాజాగా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని సైతం జనసేన ఎత్తుకుపోతూండటంపై టీడీపీ మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అయితే మాత్రం కీలక పదవులన్నీ ఆ పార్టీకే కట్టబెట్టాలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్‌ ఎన్నికల వేళ జనసేన, టీడీపీ నేతల మధ్య సీటు ఫైట్‌ తీవ్ర స్థాయిలో సాగుతోంది. చైర్మన్‌ స్థానం తమకంటే తమకంటూ ఇరు పార్టీలూ రచ్చరచ్చ చేస్తున్నాయి. పొత్తు ధర్మం పాటించాలని జనసేన అంటూండగా.. తమ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో జనసేన పెత్తనమేమిటంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. జిల్లా లోని మెజార్టీ స్థానాల్లో జనసేన పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహోదగ్రులవుతున్నారు.

ఆ ఐదూ మాకే ఇవ్వాలి

కాకినాడ మేయర్‌తో పాటు తుని, పిఠాపురం, పెద్దాపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్మన్‌ స్థానాలు తమకే ఇచ్చేయాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయం ఇటీవల చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీలో నిర్ధారణ అయినట్లు ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయా స్థానాల్లో పోటీకి అభ్యర్థులను సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ పరిణామాలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్‌ స్థానాలను సైతం జనసేనకు కట్టబెట్టడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఇరు పార్టీల మధ్య విభేదాల అగ్గి రాజుకుంటోంది.

పెద్దాపురం.. గరంగరం.. చివరకు టీడీపీ పరం

సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్లుగా టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు తొలుత చెప్పడంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దాపురంలోని మొత్తం 32 వార్డులకు గాను తమకు ఏడు మాత్రమే కేటాయిస్తారని తెలియడంతో వారు మండిపడ్డారు. దీనిపై జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్దాపురంలో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ పొత్తు ధర్మం పాటించకపోతే ఒంటరిగానైనా పోటీ చేస్తాం తప్ప.. సర్దుకుపోయే పరిస్థితే లేదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తున్నారనే విషయం వెల్లడి కావడంతో గురువారం టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఈ పదవిని టీడీపీ అభ్యర్థికే కేటాయించాలంటూ ఆ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జనసేన నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సీటు టీడీపీకి ఇవ్వకపోతే పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. రాత్రి వరకూ వేచి చూసి, రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. చర్చోప చర్చల అనంతరం పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని తమకే ఉంచుకోవాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీనికి బదులుగా సామర్లకోటను జనసేనకు సమర్పించుకున్నారు.

క్రాంతి ఓటు బదిలీపై వివాదం

ఇదిలా ఉండగా బార్లపూడి క్రాంతి తన ఓటును తూర్పు గోదావరి నుంచి కాకినాడ జిల్లాకు బదిలీ చేసుకున్నారనే విషయం వివాదాస్పదంగా మారింది. ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఉండటంతో ఏలేశ్వరం జెడ్పీటీసీగా జనసేన తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె తన ఓటును ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లికి రాత్రికి రాత్రే బదిలీ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. క్రాంతి అమ్మమ్మ గారి ఊరు పెద్దనాపల్లి. అన్‌ రిజర్వ్‌డ్‌గా ఉన్న జెడ్పీటీసీ స్థానం ఏలేశ్వరం. అందుకే అక్కడికి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. క్రాంతి ఓటును బదిలీ చేసేందుకు కొందరు ఉన్నతాధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న సమయంలో ఓటు బదిలీపై అధికారులు హైరానా పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఓటు బదిలీ చేసేశారా.. లేదంటే రాత్రికి రాత్రి చేస్తారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత అధికారంలో ఉన్నా.. ఇంతలా అధికార దుర్వినియోగానికి పాల్పడతారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement