● చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
● వైఎస్సార్ సీపీకి జై అంటున్న జనం
● పలు ప్రాంతాల్లో ఆ పార్టీలో భారీగా చేరికలు
కిర్లంపూడి/ఏలేశ్వరం/జగ్గంపేట/పెద్దాపురం: చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర అసంతృప్తి చెందుతున్న ప్రజలు అధికార టీడీపీని వీడి.. పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో వందలాది మంది గురువారం వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు.
● ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో టీడీపీకి చెందిన లింగంపర్తి సొసైటీ మాజీ చైర్మన్ చిక్కాల లక్ష్మణరావు, మాజీ వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మితో పాటు ఆ మండల నేత అడపా పార్థసారథి, మరో 30 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత దివంగత ముద్రగడ పద్మనాభం నివాసానికి తరలివచ్చి, ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
● ఏలేశ్వరం నగర పంచాయతీ చైతన్య నగర్కు చెందిన భజంతుల లక్ష్మణరావు, నాగమణి, మీసాల ఆంజనేయులు, ముత్యాల సత్తిబాబుతో పాటు 50 మంది.. అంబేడ్కర్ నగర్కు చెందిన పలివెల నూకరాజుతో పాటు సుమారు 100 మంది గిరిబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఏలేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకూ మొండిచెయ్యి చూపిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్యకుమార్, దళే కిషోర్, పైల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● జగ్గంపేట మండలం భావవరం గ్రామానికి చెందిన పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్ కోట గణపతితో పాటు ఆయన మద్దతుదారులైన 50 కుటుంబాల వారు టీడీపీకి బై చెప్పారు. వారందరూ ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత కంచి లక్ష్మణదొర నేతృత్వాన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇర్రిపాకలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి చంటిబాబు పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేద్దామని చెప్పారు.
● పెద్దాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో 8, 11 వార్డులకు చెందిన సుమారు 40 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. వారికి పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ కండువాలు వేసి, సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ రాజ్యం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారని చెప్పారు.


