మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 191 వార్డులకు సంబంధించి 321 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,18,054 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. వార్డు సభ్యుల ఎన్నికకు పింక్‌, చైర్మన్‌ ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లు ఉపయోగిస్తామని చెప్పారు. పోలింగ్‌ ముగిసిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అనర్హతకు గురయ్యే అవకాశముంటుందని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయి లో 89788 75559 ఫోన్‌ నంబర్‌తో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు ఊరేగింపులకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 12,61,063 మంది ఓటర్లు 1,426 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోను న్నారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 430 ఎంపీటీసీ స్థానాలుండగా, వివిధ కారణాలు, కోర్టు కేసుల నేపథ్యంలో 29 స్థానాలకు ఎన్నికలు జరగడం లేదని వివరించారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కాకినాడ జేఎన్‌టీయూ, పెద్దాపురం ఎంఆర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 436 సమస్యాత్మక, 270 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి 151 సమస్యాత్మక, 27 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్‌ మాట్లాడుతూ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రౌడీ షీటర్లను బైండోవర్‌ చేస్తున్నామని చెప్పారు.

పకడ్బందీగా కోడ్‌ అమలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్‌)ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ పరిపాలన అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై శనివారం ప్రత్యక్ష శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి ఈ నెల 26న మొదటి, 30న రెండో విడత శిక్షణ ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి ఈ నెల 22న మొదటి, 26న రెండో విడత శిక్షణ ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement