మోగింది సంగ్రామ భేరి | - | Sakshi
Sakshi News home page

మోగింది సంగ్రామ భేరి

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల సంగ్రామానికి ఎట్టకేలకు నగారా మోగింది. మున్సిపల్‌, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. దీంతో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) తక్షణం అమలులోకి వచ్చింది. కోడ్‌ ముగిసేంత వరకూ ఎటువంటి శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేపట్టకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించకూడదు.

దశలవారీగా..

ఈ ఎన్నికలు దశల వారీగా నిర్వహిస్తారు. తొలుత పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ), అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయా పార్టీల తరఫున సీట్లు దక్కించుకునేందుకు నేతల వద్దకు క్యూ కడుతున్నారు.

జిల్లాలో 6 పట్టణ స్థానిక సంస్థలకు..

జిల్లాలో కాకినాడ నగర పాలక సంస్థ; పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాలిటీలు; ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. విలీన గ్రామాల వివాదం, వార్డుల విభజన, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాల నేపథ్యంలో కాకినాడ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన మున్సిపాలిటీల్లో మొదటి దశలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. సామాజికవర్గాల వారీగా ఓటర్ల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు, వార్డుల విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పోలింగ్‌ కేంద్రాలను సైతం గుర్తించారు.

రెండో దశలో పరిషత్తులకు..

రెండో దశలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 20 జెడ్పీటీసీ, 430 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధంగా ఉండగా.. బ్యాలెట్‌ పేపర్లను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు.

గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో..

స్థానిక ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తారు. నవంబర్‌ 13న తొలి దశ, 16న రెండో దశ, 19న మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 26న తొలి దశ, 29న రెండో దశ, డిసెంబర్‌ 2వ తేదీన మూడో దశ పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలు చేపడతారు.

అభ్యర్థుల వేట

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో రాజకీయ పార్టీల నేతలు మున్సిపల్‌ చైర్మన్‌, జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థుల వేటలో పడ్డారు. ఇప్పటికే కూటమిలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తమకు అనుకూలమైన స్థానాల్లో రిజర్వేషన్లు మార్చేశారంటూ జనసేన నాయకులు టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా అభ్యర్థుల ఖరారు ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎవరికి వారే చైర్మన్‌ పీఠం తమకంటే తమకంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌ సీపీ ముందంజలో ఉంది. ప్రజాదరణ ఉన్న అభ్యర్థుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. పుర, పంచాయతీ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

మహిళలే నిర్ణేతలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో మహిళలే అధికంగా ఉన్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే విజయం వరించనుంది. దీంతో, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు 12,61,063

పురుషులు 6,26,318

మహిళలు 6,34,696

ఇతరులు 49

కేటగిరీల వారీగా..

ఎస్సీ 2,11,379

ఎస్టీ 18,393

బీసీ 5,54,060

ఇతరులు 4,77,231

జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీలు 385

జెడ్పీటీసీ స్థానాలు 20

ఎంపీటీసీ స్థానాలు 430

స్థానిక సంస్థల ఎన్నికలకు

నోటిఫికేషన్‌ విడుదల

మూడు దశల్లో నిర్వహణ

తొలుత మున్సిపాలిటీలకు..

తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ,

ఎంపీపీలకు పోలింగ్‌

చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

అమలులోకి ఎన్నికల కోడ్‌

మున్సిపాలిటీల వివరాలు

మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ ఇతరులు పోలింగ్‌

ఓటర్లు ఓటర్లు ఓటర్లు కేంద్రాలు

తుని 36 210 7,247 20,489 15,090 56

ఏలేశ్వరం 28 747 5,698 12,231 6,796 34

సామర్లకోట 36 454 8,331 14,862 20,218 72

గొల్లప్రోలు 23 46 2,685 4,339 13,776 23

పిఠాపురం 36 377 8,284 16,219 18,427 72

పెద్దాపురం 32 415 3,291 25,996 11,826 64

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement